Pregnancy food: గర్భవతులు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు..-avoid these foods in pregnancy which may cause miscarriage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Food: గర్భవతులు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు..

Pregnancy food: గర్భవతులు వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తినొద్దు..

HT Telugu Desk HT Telugu
Sep 29, 2023 11:00 AM IST

Pregnancy food: ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల బిడ్డ ఎదుగుదల, ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది. అవేంటో తెలుసుకోండి.

ప్రెగ్నెన్సీలో తినకూడని ఆహారాలు
ప్రెగ్నెన్సీలో తినకూడని ఆహారాలు (pexels)

మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఎన్నో అనుమానాలు. శారీరకంగా, మానసికంగా వారిలో ఎన్నో మార్పులు. దీంతో ఈ సమయంలో చాలా మంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఆహార విషయంలోనూ ఒక్కొక్కరూ ఒక్క రకమైన సలహాలను ఇస్తుంటారు. వీటిలో ఏవి సరైనవో తెలియక సతమతమవుతుంటారు. అయితే దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భ ధారణ సమయంలో ఏ ఆహారాలను అస్సలు తినకూడదో వారు వివరిస్తున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి.

సరిగ్గా ఉడకని మాంసాలు:

గ్రిల్డ్‌ ఫిష్‌, గ్రిల్డ్‌ చికెన్‌, గ్రిల్డ్‌ మటన్‌ లాంటి వాటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటుంటారు. అయితే కొన్ని సార్లు ఇవి సరిగ్గా ఉడకకుండా ఉంటాయి. ఇలా ఉడకని, కాలని, పచ్చి మాంసాహారాలను గర్భవతులు అస్సలు తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవైపే కాలిన ఆఫ్‌ కుక్డ్‌ ఆమ్లెట్ల జోలికీ వెళ్లొద్దంటున్నారు. వీటిలో సాల్మొనెల్లా, నోరో వైరస్‌, లిస్టేరియా లాంటి పరాన్న జీవివులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల సమయానికి ముందే డెలివరీ అయిపోవడం, గర్భం పోవడం, తీవ్ర అనారోగ్యంతో శిశువు పుట్టడం లాంటి ప్రమాదాలు ఉంటాయట. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సంస్థ గర్భ ధారణ సమయంలో ఇలాంటి ఆహారాల జోలికి వెళ్లొద్దని సిఫార్సు చేస్తోంది.

పాదరసం ఎక్కువ ఉండే చేపలు:

కలుషితమైన నీటిలో పెరిగిన సొర, ట్యూనా, స్వార్డ్‌, కింగ్‌ మెకరాల్‌, మార్లిన్‌.. లాంటి కొన్ని చేపలు అత్యధిక పాదరస స్థాయిలు కలిగి ఉంటాయి. ప్రధానంగా నీటి కాలుష్యం వల్ల ఇది ఈ చేపల్లోకి వచ్చి చేరుతుంది. ఇది నరాల వ్యవస్థ, రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. కిడ్నీలకు చెడు చేస్తుంది. పొట్టలో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి గర్భధారణతో ఉన్న మహిళలు, పాలిచ్చే తల్లలు ఈ పాదరస స్థాయిలు ఎక్కువగా ఉండే చేపల్ని తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జంతువుల అవయవాలు :

జంతువులకు సంబంధించిన లివర్‌, గుండె, మెదడు, పేగులు లాంటి వాటిని ఆర్గాన్‌ మీట్‌ అంటారు. మేక, కోడి లాంటి వాటి లివర్‌ని ఎక్కువగా తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో ఎక్కువ శాతం పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ప్రధానంగా వీటిలో ఎక్కువగా ఉండే విటమిన్‌ ఏ వల్ల గర్భవతులకు ప్రమాదం. గర్భం ధరించిన మొదటి మూడు నెలల సమయంలో ఎక్కువ విటమిన్‌ ఏ తీసుకోవడం వల్ల గర్భం పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లివర్‌, కిడ్నీలాంటి వాటిని తినాలనుకుంటే వారానికి ఒకసారి మాత్రమే కొద్ది మొత్తంలో తినాలి.

ఆల్కహాల్‌, కెఫీన్‌ :

గర్భం ధరించిన వారు మద్యం తాగకూడదు. అలాగే కెఫీన్‌ ఉండే పదార్థాలను దరి చేరనీయకూడదు. వీటి వల్ల గర్భ విచ్ఛిత్తి, తక్కువ బరువుతో శిశువు పుట్టడం, శిశువులో ఎదుగుదల లోపాలు తలెత్తే అవకాశాలుంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి

WhatsApp channel

టాపిక్