Detox Breakfasts: శరీరాన్ని శుభ్రం చేసే రుచికరమైన డిటాక్స్‌ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలివిగో..-best detox breakfast recipes chia pudding granolaquinoa ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Detox Breakfasts: శరీరాన్ని శుభ్రం చేసే రుచికరమైన డిటాక్స్‌ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలివిగో..

Detox Breakfasts: శరీరాన్ని శుభ్రం చేసే రుచికరమైన డిటాక్స్‌ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలివిగో..

HT Telugu Desk HT Telugu
Nov 05, 2023 06:30 AM IST

Detox Breakfasts: ఉదయాన్నే శరీరాన్ని శుభ్రం చేసే అల్పాహారం తింటే ఎంత బాగుంటుందో కదూ. అలాంటి కొన్ని డిటాక్స్ అల్పాహార రెసిపీలు మీకోసం ఇస్తున్నాం. ఒకసారి ప్రయత్నించి చూడండి.

డిటాక్స్ అల్పాహారాలు
డిటాక్స్ అల్పాహారాలు (pexels)

మనం రోజూ రకరకాల ఆహారాలను తింటూ ఉంటాం. రకరకాల చోట్ల తిరుగుతూ ఉంటాం. రకరకాల గాలుల్ని పీలుస్తూ ఉంటాం. సరిపడా నీటిని తాగకుండా ఉంటూ ఉంటాం. వీటన్నింటి వల్లా మన లోపల మనకు తెలియకుండానే కొన్ని విష పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. వీటిని మనం నెలకోసారైనా కచ్చితంగా డిటాక్స్‌ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అవి అలా అలా పేరుకుపోయి ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అందుకోసమే కొన్ని డిటాక్స్‌ ఫుడ్‌ రెసిపీలను మన పౌష్టికాహార నిపుణులు తయారు చేశారు. అవేంటో వాటి తయారీ తీరేంటో తెలుసుకుందాం పదండి

చియా పుడ్డింగ్‌ :

చియా గింజల్లో ప్రొటీన్‌, కాల్షియం, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం.. లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆరోగ్యాన్ని ఇనుమడింప చేయడంలో ఎంతో సహకరిస్తాయి. రాత్రి పడుకోబోయే ముందు ఓ పెద్ద స్పూనుడు చియా సీడ్స్‌ని తీసుకోండి. వాటిలో సాధారణ పాలను గాని లేదంటే ఆల్మండ్‌ మిల్క్‌, కాజూ మిల్క్‌ లాంటి వాటిలో మీకు ఇష్టమైన పాలను ఎంచుకోండి. ఆ పాలను గింజల్లో పోసేసి నానబెట్టండి. రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టండి. ఉదయం ఆ గింజలు చక్కగా ఉబ్బిపోయి క్రీమీగా తయారవుతాయి. వాటిలో కొన్ని డ్రై ఫ్రూట్‌ ముక్కలు, వెనీలా ఎసెన్స్‌, మ్యాపల్‌ సిరప్‌లను వేసుకోండి. పైన కొన్ని పండ్ల ముక్కల్ని వేసుకుని తినేయండి. పరగడుపున దీన్ని తినడం వల్ల శరీరం చక్కగా డిటాక్స్‌ అవుతుంది.

కొబ్బరి గ్రనోలా :

గ్రనోలా అని మనకు మార్కెట్లో ప్యాక్డ్‌ ఫుడ్‌ దొరుకుతూ ఉంటుంది. కాకపోతే అందులో చక్కెరలు, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా వేసే అవకాశం ఉంటుంది. అందుకనే దాన్ని కాకుండా సొంతంగానే మనమే గ్రనోలా తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే ఓట్స్‌, నట్స్‌, పండ్ల ముక్కలు, కొంచెం నూనె, కావాలనుకుంటే కొద్దిగా మ్యాపల్‌ సిరప్‌లను వేసుకుని కలుపుకోవడమే. ఇక్కడ ఓట్స్‌కి బదులు హోల్‌ గ్రెయిన్స్‌ అటుకులనైనా వాడుకోవచ్చు. అలాగే సీజనల్‌గా దొరికే పండ్ల ముక్కలతోపాటుగా కొబ్బరిని వేసుకోవాలి. ఇవన్నీ ఓసారి బాగా కలుపుకుని తినేయడమే.

క్వినోవా బైట్స్‌ :

వరి, గోధుమలతో పోలిస్తే క్వినోవాలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. దీన్ని ముందు అన్నంలా వండుకోవాలి. తర్వాత దానిలో కొన్ని ఆకుకూరలు, పచ్చిమిర్చి పేస్ట్‌, క్యారెట్లు, బీన్స్‌ లాంటి కూరగాయలు, చీజ్‌, గుడ్లను వేయాలి. కాస్త ఉప్పు వేసి అవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. వాటిని చిన్న చిన్న బాల్స్‌లా చేసి టిక్కీల మాదిరిగా ఒత్తుకోవాలి. వాటిని పెనం పెట్టి కాస్త నూనె వేసి రెండు వైపులా దోరగా వేపించుకుని తీసుకోవాలి. ఇవి మంచి ప్రొటీన్‌ ఆహారమే కాకుండా డిటాక్స్‌ ఫుడ్‌ కూడా.

WhatsApp channel