Quinoa Chickpea Salad: అల్పాహారంలోకి రుచికరమైన క్వినోవా శనగల సలాడ్ బౌల్..
Quinoa Chickpea Salad: క్వినోవా, శనగలు కలిపి చేసే సలాడ్ బౌల్ నుంచి అన్ని రకాల పోషకాలు అందుతాయి. అల్పాహారంలోకి దీన్నెలా సిద్దం చేసుకోవాలో చూసేయండి.
క్వినోవా శనగల సలాడ్ (flickr)
క్వినోవా తినడం ఆరోగ్యానికి మంచిది. దాంతో సలాడ్ చేసుకొని తింటే ఇంకా బోలెడు పోషకాలు అందుతాయి. శనగలు, రకరకాల కూరగాయ ముక్కలు, చీజ్.. ఇలా ఇష్టానికి తగ్గట్లు అన్ని రకాలు కలుపుకుని ఉదయాన్నే ఒక సలాడ్ బౌల్ తింటే కడుపు నిండిపోతుంది. అదెలా చేయాలో తెలుసుకోండి. ఈ సలాడ్ డ్రెస్సింగ్ కోసం నిమ్మరసానికి బదులుగా మీకిష్టమైన సాస్, నూనెలు వాడుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
1 నిమ్మకాయ రసం
2 చెంచాల ఆలివ్ నూనె
2 వెల్లుల్లి రెబ్బలు, సన్నటి తరుగు
సగం టీస్పూన్ ఉప్పు
సగం టీస్పూన్ మిరియాల పొడి
¾ కప్పు క్వినోవా
ఒకటిన్నర కప్పుల నీళ్లు
2 కప్పుల శనగలు, ఉడికించినవి
సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు
సగం కప్పు కీరదోస ముక్కలు
2 చెంచాల క్యాప్సికం ముక్కలు
సగం కప్పు చెర్రీ టమాటాలు లేదా టమాటా ముక్కలు
కొద్దిగా కొత్తిమీర
1 చెంచా పుదీనా తరుగు
కొద్దిగా ఫెటా చీజ్ (ఆప్షనల్)
అవకాడో (ఆప్షనల్)
తయారీ విధానం:
- ముందుగా క్వినోవాలో నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకుని పావుగంట పాటూ ఉడికించుకుంటే నీళ్లు మొత్తం ఇంకిపోయి క్వినోవా ఉడికిపోతుంది.
- క్వినోవా చల్లారేలోపు సలాడ్ డ్రెస్సింగ్ సిద్ధం చేసుకోవాలి.
- ఒక చిన్న గిన్నెలో నిమ్మరసం, ఆలివ్ నూనె,వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పుదీనా తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఒక పెద్ద గిన్నెలో ఉడికించుకున్న శనగలు, కీరదోస ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, చీజ్ ముక్కలు, చల్లారిన క్వినోవా వేసుకుని కలుపుకోవాలి.
- క్వినోవా వేడిగా లేకుండా చూసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే కూరగాయ ముక్కలు కాస్త తాజాదనం కోల్పోతాయి.
- ఇందులోనే నిమ్మరసంతో సిద్ధం చేసుకున్న డ్రెస్సింగ్ కూడా వేసుకుని కలుపుకుంటే చాలు. క్వినోవా శనగల సలాడ్ రెడీ అయినట్లే.