మనం తరతరాల నుంచి బియ్యం అన్నం తినడానికి అలవాటు పడ్డాం. ఎక్కువ అన్నంతో తక్కువ కూర వేసుకుని తినడం వల్ల రక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది మధుమేహం. ఈ మధ్య కాలంలో పూర్తిగా తెల్లటి బియ్యాన్ని అంతా తింటున్నారు. ఎక్కువగా పాలిష్ చేసేయడం వల్ల దీనిలో పీచు పదార్థం బాగా తగ్గిపోతుంది. అందువల్ల ఇది సరళ పిండి పదార్థంగా మారుతుంది. తొందరగా అరిగిపోయి ఒక్కసారిగా రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచేస్తుంది. కొన్ని రోజుల పాటు ఇదే కొనసాగుతూ ఉంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయి క్రమంగా అది మధుమేహానికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టే వారు క్వినోవా తినేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి అన్నంతో పోలిస్తే దీని వల్ల ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా? అంటే ఔననే అంటున్నారు పోషకాహార నిపుణులు.
ఓ కప్పు క్వినోవా అన్నాన్ని తినడం వల్ల మనకు 222 క్యాలరీలు లభిస్తాయి. అలాగే 8 గ్రాముల ప్రొటీన్, 39 గ్రాముల కార్బోహైడ్రేట్‌లు, 5 గ్రాముల పీచు పదార్థాలు, 3.55 గ్రాముల కొవ్వులు దొరుకుతాయి. ఫోలేట్, విటమిన్ బీ6, విటమిన్ ఈ, కాపర్, జింక్, ఐరన్, మాంగనీసు వంటివి లభిస్తాయి.