Cucumber for health and beauty: అందానికి ఆరోగ్యానికి కీర దోసకాయ
Cucumber for health and beauty: ఎండాకాలంలో శరీరం డీహైడ్రేషన్ కాకుండా తీసుకునే ఆహారంలో కీరదోస ఒకటి. పోషకాలతో పాటు తాజాదనాన్ని ఇస్తుందిది . ఆరోగ్యానికి, అందానికి ఇది చాలా రకాలుగా మేలు చేస్తుంది.
వేసవిలో పుష్కలంగా దొరికే దీని లాభాలు అనేకం. తినడానికే కాకుండా చర్మ సమస్యలకు సంబంధించిన ఫేస్‌ప్యాకులకు కూడా దీన్ని వాడొచ్చు. ఇంతకీ ఆ మార్గాలేంటో తెలుసుకుందాం.
అందం:
కీరదోసలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మానికి చల్లదనం ఇస్తాయి. ఎండ నుంచి రాగానే చర్మం మంటగా అనిపించినపుడు ఒక కీరదోస ముక్క రుద్దుకొని చుడండి, హాయిగా ఉంటుంది. దీనికి చర్మాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. దీన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. కీరాకి చర్మ రంధ్రాలని బిగుతుగా చేసి , నూనె ఉత్పత్తిని తగ్గించే గుణం ఉంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లకి ఇది బాగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల చర్మం మీద ఉన్న మచ్చలు తగ్గుతాయి. కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలని కూడా కీరా తగ్గిస్తుంది. నిద్ర లేచిన వెంటనే మొహం ఉబ్బినట్టు కనిపిస్తే కీరాతో రుద్దితే ఫలితం ఉంటుంది.
కీరదోసతో వివిధ ఫేస్ ప్యాకులు వేసుకుంటే కూడా చాలా ప్రయోజనాలున్నాయి. కీరాను ముద్దలాగా చేసి ఒకట్రెండు చుక్కల నిమ్మరసం, కొంచెం తేనె కలపాలి. ఈ గుజ్జును ముఖానికి పట్టించి 10 నిముషాలు ఉంచుకుని కడిగేసుకుంటే ముఖం తాజాగా అనిపిస్తుంది. లేదా కీరా గుజ్జులో స్పూను ఓట్స్, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకుంటే స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది. మొటిమల సమస్య ఉంటే కీరాతో పాటు కలబంద లేదా అలోవెరా జెల్ కలుపుకొని ముఖం, మెడకు పట్టించండి. నల్లటి మచ్చలున్నా కూడా తగ్గుముఖం పడతాయి. కళ్లు కాస్త ఉబ్బినట్టు అనిపించినా, లేదా అలిసినట్టు అనిపించినా కళ్ల మీద గుండ్రంగా తరిగిన కీరా ముక్క పెట్టుకుని విశ్రాంతి తీసుకోండి. చల్లగా అనిపిస్తుంది.
ఆరోగ్యం:
వేసవిలో రోజూవారీ తినే సలాడ్లలో కీర దోసను తప్పక వాడండి. దీంట్లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. అందుకే చక్కర స్థాయుల్ని నియంత్రణలో ఉంచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయ పడుతుంది. పిల్లలు నేరుగా తినకపోతే శాండ్విచ్ లో కూడా పెట్టి ఇవ్వొచ్చు. అలాగే ఆఫీస్ కి వెళ్ళేవాళ్లు కీరదోస సారం ఉన్న నీళ్లు తాగొచ్చు. ఒక రెండు గంటల ముందే బాటిల్ నీటిలో తరిగిన కీరా ముక్కలు వేసి ఉంచితే చాలు. కీరా నీరు సిద్ధం. కేవలం కీరానే కాకుండా పుదీనా లేదా తులసి ఆకులు కూడా ఇదే నీటిలో వేసుకోవచ్చు. నీటికి కాస్త ఫ్లేవర్ రావాలనుకుంటే గుండ్రగా తరిగిన నిమ్మకాయ ముక్కలు, కీరా వేసి కాస్త మెదిపినట్టు చేసి నీరు పోసుకుంటే చాలు. దీనివల్ల ఎక్కువ నీరు తాగడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి.