Protein Powder Alternatives: ప్రొటీన్‌ పౌడర్లకు బదులు ఈ ఇంటి ఆహారాలు తింటే చాలు..-know what are the best replacements for protein powders ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Protein Powder Alternatives: ప్రొటీన్‌ పౌడర్లకు బదులు ఈ ఇంటి ఆహారాలు తింటే చాలు..

Protein Powder Alternatives: ప్రొటీన్‌ పౌడర్లకు బదులు ఈ ఇంటి ఆహారాలు తింటే చాలు..

Koutik Pranaya Sree HT Telugu
Oct 31, 2023 11:30 AM IST

Protein Powder Alternatives: ప్రొటీన్ పౌడర్లకు బదులుగా ఇంట్లోనే ఉత్తమమైన ఆహారాలు ఉన్నాయి. అవి తింటే బయట ప్రొటీన్ పౌడర్లు కొని తినాల్సిన పనిలేదు. అవేంటో తెలుసుకోండి.

ప్రొటీన్ పౌడర్ ప్రత్యామ్నాయాలు
ప్రొటీన్ పౌడర్ ప్రత్యామ్నాయాలు (pexels)

సిక్స్‌ ప్యాక్ల కోసం, బలమైన కండరాల కోసం కసరత్తులు చేసే వారు ఎక్కువగా ప్రొటీన్‌ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే బలం కోసం చికెన్‌ తింటారు. అదనంగా ఖరీదైన ప్రొటీన్‌ పౌడర్లను తెచ్చుకుని ప్రొటీన్ షేక్‌లు చేసుకుని తాగుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాల్ని విరివిగా వాడుకోవడం ద్వారా ప్రొటీన్‌ పౌడర్ల అవసరమే రాదని ఫిట్‌నెస్‌ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. ఇవి ఖరీదు కూడా అంత ఎక్కువేం కాదంటున్నారు. ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

పెసర్లు :

పొట్టు తీయని పెసర్లు, పెసర పప్పుల్లో అత్యధికంగా మొక్కల ఆధారితంగా ఉండే ప్రొటీన్లు లభిస్తాయి. ఇంకా వీటిలో హెనిలాలనైన్, లూసిన్, ఐసోలూసిన్, వాలైన్, లైసిన్, అర్జినైన్ లాంటి అమీనో యాసిడ్లూ దొరుకుతాయి. ఇవన్నీ కండల్ని మరింత దృఢంగా చేయడంలో సహకరిస్తాయి.

వేరు శెనగ గుళ్లు :

మిగిలిన ఏ గింజల్లోనూ లేనంత ప్రొటీన్‌ ఈ వేరు శెనగ గింజల్లో దొరుకుతుంది. వీటిలో మొత్తం 20 రకాల అమైనో యాసిడ్లు వేరు వేరు శాతాల్లో దొరుకుతాయి. అర్గినైన్‌ అనే ప్రొటీన్‌ ఇందులో పెద్ద మొత్తంలో దొరుకుతుంది. రోజూ ఓ గుప్పెడు పల్లీలను తినడం వల్ల మన ప్రొటీన్‌ అవసరాలు తీరతాయి. కావాలనుకుంటే పీనట్‌ బటర్‌ని కూడా వాడుకోవచ్చు.

పనీర్‌ :

మీరు గనుక ప్రొటీన్‌ ఆహారాలను ఎక్కువగా తినాలని అనుకుంటున్నట్లయితే పనీర్‌ని ఒక ఆప్షన్‌గా తీసుకోవచ్చు. కాటేజ్‌ చీజ్‌ లేదా పనీర్‌లో ఎక్కువ మొత్తంలో జంతు సంబంధిత ప్రొటీన్‌లు ఉంటాయి. అలాగే ఇది తక్కువ ధరలోనూ దొరుకుతుంది. పాలు, పెరుగులనూ ఇందు కోసం వాడుకోవచ్చు. అలాగే సోయాతో తయారు చేసే టోఫూలో కూడా ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది.

శెనగలు :

పండుగల సమయంలో దేవుడికి ప్రసాదంలా ఎక్కువగా శెనగల్ని చేసి పెడుతూ ఉంటారు. అయితే వీటిని సాధారణంగా ప్రొటీన్‌ కోసం కూడా రకరకాలుగా వండుకుని ఆహారంలో చేర్చుకోవచ్చు. వీటిలో సరాసరిన 18 శాతం వరకు ప్రొటీన్‌ దొరుకుతుంది. పప్పు ధాన్యాల కంటే అధికంగా వీటిలో ఇది దొరుకుతుంది.

చియా సీడ్స్‌ :

చియా సీడ్స్‌లో పీచు పదార్థాలే కాదు ప్రొటీన్‌ కూడా అధికంగా ఉంటుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ఈ గింజల్ని నానబెట్టుకుని తింటే దాని ద్వారా నాలుగు గ్రాముల వరకు ప్రొటీన్‌ లభిస్తుంది. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా అధికంగా ఉంటాయి. ప్రొటీన్‌ పీచు పదార్థంతో పాటుగా ఉంటుంది కాబట్టి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంత సేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువగా తినకుండా ఉంటాం.

Whats_app_banner