Wheat Adai: హెల్తీగా గోధుమపిండి అడై.. ఇన్స్టంట్ బ్రేక్‌ఫాస్ట్..
Wheat Adai: ఉదయం అల్పాహరంలోకి గోధుమపిండితో అడై ప్రయత్నించి చూడండి. చాలా సులభంగా రెడీ అయిపోతుంది. రుచిగా ఉంటుంది.
గోధుమపిండి అడై (freepik)
ఉదయం అల్పాహారంలోకి గోధుమపిండితో చేసిన అడై ప్రయత్నించి చూడండి. బోలెడు కూరగాయలతో ఇన్స్టంట్ గా చేసుకునే అల్పాహారం ఇది. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్లయినా ఇష్టంగా తినేస్తారు. ఏదైనా చట్నీతో, లేదా రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి.
గోధుమపిండి అడై కోసం కావాల్సిన పదార్థాలు:
ఒకటిన్నర కప్పుల గోదుమపిండి
సగం కప్పు సన్నటి ఉల్లిపాయ ముక్కలు
1 చెంచా సాంబార్ పొడి
సగం చెంచా కారం
సగం చెంచా ధనియాల పొడి
పావు చెంచా పసుపు
2 పచ్చిమిర్చి, సన్నటి తరుగు
1 కరివేపాకు రెబ్బ
తగినంత ఉప్పు
పావు టీస్పూన్ జీలకర్ర
కొత్తిమీర తరుగు కొద్దిగా
పావు కప్పు క్యారట్ తురుము
గోదుమపిండి అడై తయారీ విధానం:
- ముందుగా ఒక పెద్దగిన్నెలో గోదుమపిండి తీసుకోవాలి. అందులో సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సాంబార్ పొడి, ఉప్పు వేసుకోవాలి.
- సన్నగా తరుగుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, క్యారట్ తురుము, ధనియాల పొడి కూడా వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకోవాలి.
- నీళ్లు పోసుకుంటూ పలుచటి పిండిని ఉండల్లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా ఉండకూడదు.
- పెనం పెట్టుకుని వేడెక్కాక కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇప్పుడు గరిటెడు పిండి వేసుకుని కాస్త మందంగా దోసెల్లాగా పోసుకోవాలి.
- అంచుల వెంబడి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. కాస్త రంగు మారాక తీసుకుని వేడిగా సర్వ్ చేసుకోవడమే.
- వీటిని వేడిగా ఏదైనా చట్నీతో లేదా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలు.