Ragi Chia Pudding: రాగి జావ తినలేకపోతే.. రుచిగా రాగి చియా పుడ్డింగ్ ట్రై చేయండి..-know how to make ragi chia pudding for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Chia Pudding: రాగి జావ తినలేకపోతే.. రుచిగా రాగి చియా పుడ్డింగ్ ట్రై చేయండి..

Ragi Chia Pudding: రాగి జావ తినలేకపోతే.. రుచిగా రాగి చియా పుడ్డింగ్ ట్రై చేయండి..

Koutik Pranaya Sree HT Telugu
Dec 01, 2023 06:30 AM IST

Ragi Chia Pudding: ఉదయాన్నే అల్పాహారంలోకి రాగి జావకు బదులుగా రాగి చియా పుడ్డింగ్ ప్రయత్నించండి. తయారీ కూడా చాలా సులభం.

రాగి చియా పుడ్డింగ్
రాగి చియా పుడ్డింగ్ ()

రాగుల్ని డైట్‌లో చేర్చుకోవాలనుకుంటే జావ తాగడం మంచి మార్గం. అయితే దాని రుచి నచ్చక చాలా మంది మధ్యలోనే ఆపేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే దాన్ని కాస్త రుచిగా, భిన్నంగా మార్చుకోవాలి. రాగి చియా పుడ్డింగ్ అలాంటిదే. ఒక మంచి స్నాక్ లేదా డెజర్ట్ తిన్న అనుభూతి కలుగుతుంది. అల్పాహారంలో తింటూ కడుపూ నిండుతుంది. దాని తయారీ ఎలాగో పక్కా కొలతలతో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

1 చెంచా రాగిపిండి

1 చెంచా సేమియా

సగం చెంచా చియా గింజలు లేదా సబ్జా గింజలు

2 కప్పుల పాలు

1 చెంచా కొబ్బరి తురుము

తీపికి సరిపడా తేనె

చిటికెడు ఉప్పు

డ్రైఫ్రూట్స్ తరుగు (బాదాం, జీడిపప్పు, పిస్తా, ఎండుద్రాక్ష)

తయారీ విధానం:

  1. ముందుగా రాగిపిండిలో సరిపడా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడ మందపాటి గిన్నెలో పాలు పోసుకుని ఒక ఉడుకు వచ్చాక సేమియా, ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి పోసుకుని కలుపుతూ ఉండాలి.
  3. ఉండలు కట్టకుండా సన్నం మంట మీద చెంచాతో కలియబెడుతూ ఉండాలి.
  4. కాసేపాగి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలిపి ఒక పదినిమిషాల పాటూ ఉడికించుకోవాలి.
  5. స్టవ్ కట్టేసి చియా గింజలు వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. సర్వ్ చేసుకునే ముందు తీపిని బట్టి తేనె కలుపుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాస్త గోరువెచ్చగా లేదంటే ఫ్రిజ్ లో పెట్టుకుని తిన్నా బాగుంటుంది.

Whats_app_banner