ragi flour cutlet: రాగి పిండితో కట్‌లెట్
ragi flour cutlet: రాగిపిండితో కట్‌లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
రాగిపిండి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంతమంది రుచి నచ్చక దాన్ని వాడటం మానేస్తారు. రాగి జావ కూడా నచ్చని వారుంటారు. అలాంటప్పుడు రాగి పిండితో కట్‌లెట్లు చేసుకొని చూడండి. కాస్త విభిన్నమైన రుచితో ఇష్టంగా తినేస్తారు.
కావాల్సిన పదార్థాలు:
రాగిపిండి - సగం కప్పు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి ముద్ద - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - తగినంత
బ్రెడ్ క్రంబ్స్ - 4 టేబుల్ స్పూన్లు
ఉడికించిన బంగాళ దుంపలు - 2
క్యారట్ తురుము - సగం కప్పు
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - సగం టీస్పూన్
నూనె - 2 చెంచాలు
తయారీ విధానం:
Step 1: ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరుగుకోవాలి. క్యారట్ తురుముకోవాలి. ఒక పెద్ద గిన్నెలో వీటిని తీసుకొని ఉడికించిన బంగాళ దుంప ముద్ద కూడా వేసుకోవాలి.
Step 2: దీంట్లో రాగి పిండి, ఉప్పు, కారంపొడి, కొత్తిమీర తరుగు, గరం మసాలా, వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. అంతా ముద్దలాగా కలుపుకోవాలి. అవసరమైన రెండు మూడు చెంచాల నీళ్లు కలుపుకోండి.
Step 3: ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని మీకిష్టమైన ఆకారంలో ఒత్తుకోండి.
Step 4: ఈ కట్‌లెట్లను బ్రెడ్ క్రంబ్స్ లో ఒకసారి దొర్లించండి.
Step 5: ఒక పెనం తీసుకుని ఒక చెంచా నూనె వేసుకుని అంతటా రాయండి. ఇప్పుడు కట్‌లెట్ లను దూరం దూరంగా పెట్టుకోండి. కొద్దిగా నూనె వేసుకుంటూ రెండు వైపులా రంగు మారేంత వరకు కాల్చుకోవాలి. అంతే ట్‌లెట్ సిద్ధం.
దీన్ని ఇంకాస్త ఆరోగ్యకరంగా మార్చడానికి మీకిష్టమైన కూరగాయ ముక్కలు ఉల్లికాడలు, బఠానీ, క్యాప్సికం లాంటివి ఏవైనా కలుపుకోవచ్చు. ఇంట్లో ఉండే టమాటా చట్నీతో లేదా కెచప్ తో వీటిని ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.