Vitamin Tea: మీ చాయ్‌ని విటమిన్ల టీగా మార్చుకోండిలా..-know how to make normal tea as a vitamin loaded tea ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin Tea: మీ చాయ్‌ని విటమిన్ల టీగా మార్చుకోండిలా..

Vitamin Tea: మీ చాయ్‌ని విటమిన్ల టీగా మార్చుకోండిలా..

HT Telugu Desk HT Telugu
Oct 02, 2023 10:30 AM IST

Vitamin Tea: టీలో విటమిన్లు చేర్చుకుని తాగితే ఇంకేముంది. టీ తాగిన ప్రతిసారి అనారోగ్యం అనే ఆలోచన రాకుండా ఉంటుంది. చాయ్ ని విటమిన్లతో నింపేసే మార్గాలేంటో తెలుసుకోండి.

విటమిన్ టీ
విటమిన్ టీ (Unsplash)

మనలో చాలా మందికి టీ తాగడమంటే ఇష్టం. మసాలా టీ, అల్లం టీ, బెల్లం టీ అంటూ రకరకాల ఫ్లేవర్లలో దీన్ని తయారు చేసుకుని తాగేస్తుంటాం. మరి పంచదార, టీ పొడి, పాలు చేర్చి తయారు చేసుకునే టీని రోజుకు ఒక సారి తాగితే ఫర్వాలేదు. అంతకంటే ఎక్కువ సార్లు దీర్ఘకాలం పాటు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి టీ తాగాలి.. దాని వల్ల చెడు ఫలితాలు రాకూడదు.. అనుకుంటే గనుక మీ టీని ఇలా తయారు చేసుకుని చూడండి. టీ పొడి మానేసి కొన్ని పదార్థాలను చేర్చి టీ చేసుకుని తాగి చూడండి. వీటి వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మీ శరీరానికి చక్కగా అందుతాయి. టీ తాగినట్లూ ఉంటుంది. దాని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ మనకు లభిస్తాయి. ఇక్కడ కొన్ని విటమిన్ల టీలు ఎలా తయారు చేసుకోవాలో ఉంది. చదివేయండి.

సిట్రస్‌ టీ :

కొన్ని పుదీనా ఆకుల్ని, చాలా కొంచెం టీ పొడిని నీళ్లలో వేసి మరగనివ్వండి. వడగట్టి అందులో నిమ్మకాయ, కమల, నారింజ, బత్తాయి.. ఇలా మీకు నచ్చిన నిమ్మజాతి పండు ఒకటి తీసుకుని రసం పిండండి. కావాలనుకుంటే కొద్దిగా తేనెను కలిపి తాగండి. ఇది ఎంతో రిఫ్రెషింగ్‌ ఉంటుంది. పుదీనాలో విటమిన్‌ ఏ, సీలు ఉంటాయి. అలాగే నిమ్మజాతి పండ్లలో సీ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. అది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

దాల్చిన చెక్క టీ :

గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో దాల్చిన చెక్క ముక్క వేసి బాగా మరగనివ్వండి. దీన్ని వడగట్టుకుని గోరు వెచ్చగా తాగండి. దాల్చిన చెక్కలో విటమిన్‌ ఏ, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలు ఉంటాయి. పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి. క్యాన్సర్లు, మధుమేహం, గుండె జబ్బుల్లాంటివి రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఫంగల్‌ గుణాల వల్ల ఇది బ్యాక్టీరియాలు, ఫంగస్‌లతో పోరాడి మనల్ని జబ్బుల బారిన పడకుండా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

అల్లం టీ :

మరుగుతున్న నీళ్లల్లో ఓ అంగుళం అల్లం ముక్క చితక్కొట్టి వేయండి. దాంట్లో కాస్త పసుపును కూడా జోడించి మరిగించి వడగట్టండి. అల్లంలో విటమిన్‌ సీ, బీ విటమిన్లైన థయామిన్‌, రైబోఫ్లావిన్‌, నియాసిన్‌, ఐరన్‌, కాల్షియం, పాస్ఫరస్‌ లాంటివి ఉంటాయి. అందుకనే అల్లం రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పసుపులో ఉండే కర్య్కుమిన్‌ క్యాన్సర్లను తగ్గిస్తుంది.

Whats_app_banner