Namak para: గోధుమపిండితో ఉప్పు బిస్కట్లు.. నెల రోజులు నిల్వ ఉంటాయి..
Namak para: ప్రయాణాల్లో, సాయంత్రం పూట తినడానికి ఏదైనా స్నాక్ కోసం చూస్తున్నారా. అయితే నమక్ పారా అనే ఈ ఉప్పు బిస్కట్లు చేసేయండి. వాటి తయారీ చూసేయండి.
సాయంత్రం పూట స్నాక్ కోసం పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. రోజూ ఏదో ఒకటి చేసివ్వడం కష్టమే. అలాంటప్పుడు చాలా సింపుల్ గా చేసుకోగలిగే నమక్ పారా ట్రై చేయండి. నమక్ అంటే ఉప్పు, పారా అంటే ముక్కలు. ఉప్పుగా ఉండే బిస్కట్ల లాంటివి అన్నమాట. పదే నిమిషాల్లో వీటిని చేసేయొచ్చు. ఒక్కసారి చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు సాదా సీదా నమక్ పారా ఎలా చేయాలో చూసేయండి. మీకు నచ్చితే మరోసారి చేసుకున్నప్పుడు వీటిలోనే కారం, కసూరీ మేతీ, గరం మసాలా, పసుపు.. ఇలా చాలా రకాలుగా పదార్థాలు మార్చి వెరైటీ ఫ్లేవర్‌లో చేసుకోవచ్చు.
నమక్ పారా తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు గోధుమపిండి
1 కప్పు మైదా
1 చెంచా వాము
సగం చెంచా మిరియాల పొడి
సగం చెంచా జీలకర్ర
పావు చెంచా వంటసోడా
2 చెంచాల నూనె
తగినంత ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
నమక్ పారా తయారీ విధానం:
1. ముందుగా గోధుమపిండి, మైదా, సోడా, ఉప్పు వేసుకుని అన్నీ కలిపి జల్లెడ పట్టుకోవాలి.
2. జల్లించుకున్న పిండిలో వాము, మిరియాల పొడి, జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి కలపాలి.
3. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండితో కాస్త మందంగా చపాతీ ఒత్తుకునేలా ఉండాలి. కానీ చపాతీ పిండిలాగా మరీ మెత్తగా కలపొద్దని గుర్తుంచుకోండి.
4. పిండి కలుపుకున్నాక కనీసం ఇరవై నుంచి ముఫ్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి మీద మూత లేదా తడి గుడ్డ వేయడం మర్చిపోవద్దు.
5. ఇప్పుడు పిండిని ఉండల్లా చేసుకుని కాస్త గోధుమపిండి చల్లుకుని మందంగా చపాతీలాగా ఒత్తుకోవాలి.
6. చాకు సాయంతో ఈ చపాతీ మీద మీకిష్టమైన ఆకారంలో గీతలు పెట్టుకోవాలి. మామూలుగా అయితే డైమండ్ లేదా రాంబస్ ఆకారంలో వీటిని ఎక్కువగా చేస్తారు.
7. కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని వేయించుకోవాలి. క్రిస్పీగా రంగు మారేంత వరకు వీటిని వేయించాలి.
8. అవి చల్లారాక వాటిని గాలి చొరని గాజు సీసాలో వేసి ఉంచాలి. కనీసం వారం నుంచి రెండు వారాలైనా వీటిని తినొచ్చు. టీ తాగేటప్పుడు మంచి స్నాక్ లాగా పనికొస్తాయి.