Vamu Annam: పిల్లలకు వారానికోసారి వాము అన్నం తినిపించండి, ఇదిగో రెసిపి-vamu annam recipe in telugu know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vamu Annam: పిల్లలకు వారానికోసారి వాము అన్నం తినిపించండి, ఇదిగో రెసిపి

Vamu Annam: పిల్లలకు వారానికోసారి వాము అన్నం తినిపించండి, ఇదిగో రెసిపి

Haritha Chappa HT Telugu

Vamu Annam: వాము అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి ఒకసారైనా తినాలి.

వాము అన్నం ఎలా చేయాలి? (youtube)

Vamu Annam: బ్రేక్ ఫాస్ట్ అనగానే కేవలం ఇడ్లీ, దోశ, ఉప్మా అని మాత్రమే అనుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ అంటే బలమైన ఆహారాన్ని దేనినైనా తినవచ్చు. వారంలో ఒకసారి వాము అన్నం తినడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా పిల్లలకి వాము అన్నం తినిపిస్తే ఎంతో మంచిది. దీనిలోని ఔషధ గుణాలు వారి జీర్ణశక్తిని, జీర్ణ వ్యవస్థను, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వాము అన్నం చేయడం చాలా సులువు.

వాము అన్నం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వండిన అన్నం - రెండు కప్పులు

వాము - రెండు స్పూన్లు

ఎండుమిర్చి - రెండు

కరివేపాకు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

నూనె - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

వాము అన్నం రెసిపీ

1. ముందుగా అన్నాన్ని వండి ఒక ప్లేట్లో వేసి పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.

2. అది కాస్త గోరువెచ్చగా మారాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనెలో ఎండుమిర్చిని వేసి వేయించాలి. అది వేగాక జీలకర్ర, వాము వేసి వేయించాలి.

5. ఆ రెండు బాగా వేగాక గుప్పెడు కరివేపాకులను వేసి వేయించాలి.

6. ఈ మిశ్రమంలో ముందుగా పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టిన అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. వాము అన్నం రెడీ అయినట్టే.

8. ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది. కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు.

ఓసారి వాము అన్నం తినడం వల్ల పిల్లలు, పెద్దల పొట్ట శుభ్రపడుతుంది. అజీర్తి, పొట్టలో గ్యాస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆర్థరైటిస్ వల్ల చలికాలంలో ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి వాము అన్నం సహాయపడుతుంది. స్త్రీలు వాము అన్నాన్ని తినడం వల్ల నెలసరి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. జీర్ణాశయం సంబంధిత సమస్యలను తొలగించే శక్తి వాము అన్నానికి ఉంది.