Strong Smells Tips: ఇంట్లో ఎప్పుడూ సుగంధాలు రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ చాలు..
Strong Smells Tips: ఇంట్లో ఎప్పుడూ సువాసన వచ్చేలా, ఆహ్లాదకరంగా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటించాలి. అవి ఇంటిని సువాసనభరితంగా మార్చేస్తాయి.
కొన్ని సార్లు వంటింట్లో చేపల్లాంటివి వండినప్పుడు ఒక రకమైన నీచు వాసన ఇల్లంతా నిండిపోతుంది.కొన్నిసార్లు ఏదైనా మాడి పోయి ఇల్లంతా వాసన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లేమో ఉన్నట్టుండి సింక్ దగ్గరో, కిచెన్ నుంచి కాస్త వాసన వస్తుంటుంది. తలుపులు పూర్తిగా తీసి పెట్టినా, ఫ్యాన్లు వేసి ఎన్ని చేసినా ఆ వాసనలు మాత్రం అంత తొందరగా పోవు. గాఢంగా ఉండటం వల్ల వాటిని తొలగించడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు కొన్ని పనులు చేయడం వల్ల ఇలాంటి ఎక్కువ గాఢత కలిగిన వాసనలను తొలగించవచ్చు.
ఎయిర్ ఫ్రెషనర్:
ఇప్పుడు ప్లగ్‌కి తగిలించి స్విచ్ వేస్తే పని చేసే ఎయిర్ ఫ్రెషనర్స్ చాలా ఉంటున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల వాసనలు మారవచ్చు. అయితే ఈ వాసనలు కూడా మైల్డ్‌గా ఉండే వాటినే ఎంచుకోవాలి. ఎక్కువ గాఢంగా ఉన్న పరఫ్యూమ్‌లను వాడకూడదు. అలాగే అగర వత్తుల్ని వెలిగించి పెట్టుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
సెంటెడ్ క్యాండిల్స్:
చాలా రకాల సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిని గదుల్లో మూలల్లో ఒక్కోటి పెట్టేయండి. అవసరమైనప్పుడు వెలిగించడం వల్ల గాఢమైన మాడు వాసనల్లాంటివి తగ్గుతాయి. ఇల్లు ఆహ్లాదకరంగానూ మారుతుంది.
నిమ్మ చెక్క:
మన ఇళ్లల్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి కూడా వాసనలను తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలో నిమ్మ చెక్కలు, పచ్చ కర్పూరం, దాల్చిన చెక్క లాంటివి పని చేస్తాయి. స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నీరు పోయండి. అందులో కాస్త నిమ్మ చెక్కగాని, పచ్చ కర్పూరం గాని, దాల్చిన చెక్క పొడిగాని ఏది ఉంటే అది వేసి నీటిని మరిగించండి. దీన్నుంచి వచ్చే వాసనలు చెడ్డ వాసనలను తగ్గించి సువాసన వ్యాపించేలా చేస్తాయి.
వెంటిలేషన్:
ఇంట్లో వాసన బాగోలేదు అనుకున్నప్పుడు ఇంట్లోకి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చి పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు ఉంటే వేసుకోవాలి. కిటికీ తలుపు, గుమ్మాల తలుపులు పూర్తిగా తీసి పెట్టుకోవాలి.
ధూపం వెయ్యడం:
ఇంట్లో సాంబ్రాణి, గుగ్గిలం పొడి లాంటి వాటిని ఎప్పుడూ దగ్గర పెట్టుకోవాలి. ధూపం కోసం బొగ్గుల్ని రాజేసి ఈ పొడుల్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే ఆ పొగ ఇల్లంతా వ్యాపిస్తుంది. చెడు వాసనల్ని తొలగించి ఇంటి వాతావరణాన్ని చాలా పాజిటివ్‌గా, ఆహ్లాదకరంంగా మార్చేస్తుంది.
ఎసెన్షియల్ ఆయిల్:
నిమ్మ, లావెండర్, గులాబీ, మల్లె లాంటి రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆయిల్ డిఫ్యూజర్‌లో వేసి పెట్టుకోవడం వల్ల ఇల్లంతా సువాసన వస్తుంది. చెడు వాసన మచ్చుకైనా కనిపించదు.