Know bout Camphor: కర్పూరం ఎలా వస్తుంది? ఎలాంటి అనారోగ్యానికి ఎలా వాడాలి?-know how camphor is made and its different benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know Bout Camphor: కర్పూరం ఎలా వస్తుంది? ఎలాంటి అనారోగ్యానికి ఎలా వాడాలి?

Know bout Camphor: కర్పూరం ఎలా వస్తుంది? ఎలాంటి అనారోగ్యానికి ఎలా వాడాలి?

HT Telugu Desk HT Telugu
Sep 27, 2023 03:00 PM IST

Know bout Camphor: కర్పూరం పూజలోకే కాదు.. దానివల్ల బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలకు, దాన్నెలా వాడొచ్చో తెలుసుకోండి.

కర్పూరం లాభాలు
కర్పూరం లాభాలు (freepik)

ఇంటికి మంచి సువాసనను చేకూర్చే ద్రవ్యాల్లో కర్పూరం ఒకటి. దీన్ని వెలిగించడం వల్ల ఇంట్లో, ఒంట్లో ఉన్న నెగెటివ్‌ ఎనర్జీలు మొత్తం సమసిపోతాయని చెబుతారు. అందుకనే భారతీయ ఇళ్లల్లో దాదాపుగా ప్రతి పూజా మందిరంలోనూ కర్పూరం ఉంటుంది. పూజలు, శుభ కార్యాల్లో దీన్ని తప్పకుండా వాడతారు. అయితే ఇది ఎలా తయారవుతుందనేది చాలా మందికి తెలియదు. ఆ విషయంతోపాటుగా దీన్ని వాడటం వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కర్పూరం తయారవుతుందిలా..

సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది. దీన్నే మనం కర్పూరం చెట్టు అంటుంటాం. దీని వేర్లు, చెక్క, బెరడు, విత్తనాలు, ఆకులను ప్రాసెస్ చేసి కర్పూరం, పచ్చ కర్పూరం, కర్పూర నూనె తదితరాలను తీస్తారు. అయితే ఇప్పుడు సహజమైన కర్పూరం కంటే మార్కెట్లో సింథటిక్‌ కర్పూరం పెరిగిపోయింది. దీన్ని ఆరోగ్య అవసరాల కోసం వాడకుండా ఉండటమే ఉత్తమం. సహజమైన కర్పూరం దొరికితే గనుక దాని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

కర్పూరం ఉపయోగాలు:

శ్వాస కోశ ఇబ్బందులకు:

ఊపిరితిత్తులు, గొంతుల్లో.. వాపులు, అలర్జీలతో బాధపడేవారికి ఇది చక్కగా పని చేస్తుంది. అలాగే ముక్కు పూడుకుపోయి శ్వాస అందకపోవడం, దగ్గు ఎక్కువగా రావడం లాంటి సమస్యలు ఉన్న వారూ దీన్ని తరచుగా వాసన చూడటం వల్ల ఫలితం ఉంటుంది.

నొప్పులకు:

నరాల్లో ఒత్తిడిని తగ్గించడం ద్వారా నొప్పులు, దురదలను ఇది తగ్గిస్తుంది. శరీరంపై సమస్యాత్మక ప్రాంతంలో ఈ కర్పూరం లేదా కర్పూర నూనెను పది శాతం తీసుకుని దానికి మరో 90 శాతం కొబ్బరి నూనెను కలపాలి. దీన్ని రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అలాగే చర్మానికి చల్లదనం కలిగి హాయిగా ఉంటుంది.

ఆర్థరైటిస్‌కి:

కర్పూరం ఉన్న స్ప్రేని ఆర్థరైటిస్‌ నొప్పులు ఉన్నవాళ్లు పూసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే ఇది నొప్పిని తగ్గించి హాయినిస్తుంది గానీ లక్షణాలను తగ్గించదని పరిశోధకులు చెబుతున్నారు.

గోరు చుట్లకు:

వర్షాకాలంలో చేతులు, కాలి గోళ్లకు ఇన్‌ఫెక్షన్లు, గోరు చుట్లలాంటివి వస్తుంటాయి. యూకలిప్టస్‌ నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి వీటికి రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

లోబీపీకి:

ఒక్కొక్క సారి సడన్‌గా లోబీపీ సమస్య ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటప్పుడు హవ్తోర్న్‌ ఎక్స్‌ట్రాక్ట్‌కి కర్పూరం కలిపి లోపలికి తీసుకోవడం వల్ల బీపీ మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

దోమల నివారణకు:

కప్పు నీటిలో కర్పూరం వేసి పడుకునే గదిలో పెట్టుకోవడం వల్ల దోమలు రావు. అలాగే దీనికున్న ఘాటైన వాసన వల్ల పురుగుల్లాంటివీ దరి చేరవు.

Whats_app_banner