Flaxseed Dosa । అవిసెగింజలతో దోశ.. ఆర్థరైటిస్‌కు మంచిది!
ఆర్థరైటిస్, ఇతర కీళ్ల నొప్పులకు మనం తినే అల్పాహారంతో కూడా పరిష్కారం చూపవచ్చు. ఇక్కడ ఆర్థరైటిస్‌ను నయం చేసే పోషకాలు కలిగిన అవిసె గింజల దోశ (Flaxseed Dosa) రెసిపీని అందిస్తున్నాం, చూడండి.
రోజులో మనం చేసే మొదటి భోజనం అంటే ఉదయం మనం తినే అల్పాహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా, రోజంతా చురుకుగా ఉండాలన్నా బ్రేక్‌ఫాస్ట్‌లో మనం తినే ఆహారంతోనే ముడిపడి ఉంటుంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ దాటవేయవద్దు అని చెప్తారు. పోషకభరితమైన, ఆరోగ్యకరమైన పదార్థాలను ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి.
ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించటానికి కూడా అనువైన అల్పాహారాలు ఉన్నాయి. సాల్మన్, సార్డినెస్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు శరీరంలో మంటను తగ్గించడానికి పని చేస్తాయి. పసుపు, అల్లం కూడా కీళ్ల నొప్పుల తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అవిసె గింజలతో రుచికరంగా దోశలు కూడా చేసుకోవచ్చు. అవిసె గింజల దోశ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. కావలసిన పదార్థాలు, తయారీవిధానం ఇక్కడ చూడండి.
Flaxseed Dosa Recipe కోసం కావలసినవి:
- అవిసె గింజల పొడి - 1/2
- బియ్యం పిండి - 1 కప్పు
- కరివేపాకు - 2-3 రెమ్మలు
- నల్ల మిరియాల పొడి - 2 స్పూన్లు
- పచ్చిమిర్చి - 2
- నీరు - 2 కప్పులు
- ఉప్పు - రుచికి తగినట్లుగా
అవిసె గింజల దోశ రెసిపీ- తయారీ విధానం
- ముందుగా అవిసె గింజలను తేలికగా పెనంపై కాల్చుకొని ఆ తర్వాత వాటిని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీలో అవిసె గింజల పొడి, బియ్యం పిండి, నల్ల మిరియాల పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు అన్ని వేసి నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- దోశలు వేసుకునేందుకు వీలుగా నీరు సర్దుబాటు చేసుకొని బ్యాటర్ సిద్ధం చేయండి.
- ఇప్పుడు పాన్‌ను వేడి చేసి నూనెతో గ్రీజు చేసి, ఆపై ఒక గరిటెతో దోశ బ్యాటర్ వేసి, గుండ్రంగా దోశను చేసుకోవాలి.
- ఈ దోశను రెండు వైపులా సమానంగా కాల్చుకోవాలి.
అంతే, అవిసెగింజల దోశ రెడీ అయినట్లే. దీనిని నేరుగా తినవచ్చు, లేదా మీకు నచ్చిన చట్నీతో తినవచ్చు.