Food Quantities: పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎంత తినాలో తెలుసా?-know how many fruits veggies and dry fruits should eat in a day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food Quantities: పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎంత తినాలో తెలుసా?

Food Quantities: పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎంత తినాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Dec 12, 2023 06:00 PM IST

Food Quantities: రోజుకు పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, ఆకు కూరలు ఏ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరమో వివరంగా తెలుసుకోండి.

ఆహార పరిమాణాలు
ఆహార పరిమాణాలు (freepik)

మనం ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుంటాం. అందుకోసం మంచి పోషకాహారాన్ని తినేందుకు ప్రయత్నిస్తుంటాం. ప్రొటీన్‌లు, కొవ్వుల కోసం మాంసాహారాలను తింటాం. అలాగే పీచు పదార్థాలు, విటమిన్‌లు, మినరళ్ల కోసం నట్స్‌, పండ్లు, కూరగాయల్ని తినేందుకు చూసుకుంటాం. అందుకనే వాటికి మన ఆహారంలో ప్రముఖంగా చేర్చుకుంటాం. అయితే వీటిని రోజుకు ఎంత తినాలి? అన్న విషయంలో మాత్రం ఎవ్వరికీ అంతగా అవగాహన ఉండదు. అలా అవగాహన కలగాలంటే ఇది చదివేయండి.

రోజుకు ఎన్ని పండ్లు తినాలి:

సీజనల్‌గా దొరికే పండ్లను మనం ఎప్పటికప్పుడు తింటూనే ఉంటాం. వాటిని ఎంత మొత్తంలో తినొచ్చంటే.. ఒక అరటిపండు తినొచ్చు. అలాగే యాపిల్‌, పియర్‌, కమలాఫలం లాంటి వాటిని ఒకటి తినొచ్చు. బొప్పాయి, కర్భూజ లాంటివి ఒక ముక్క (పండులో పావు భాగం) తినొచ్చు. మామిడి పండు అయితే సగం, పైనాపిల్‌ అయితే పావు భాగం తినొచ్చు.

డ్రై ఫ్రూట్స్‌ ఎన్ని తినొచ్చు :

మన పోషకాల అవసరాలను పూరించుకోవడానికి రోజుకు కొన్ని డ్రై ఫ్రూట్స్‌, సీడ్స్‌ని తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఎంత తినాలి అంటే దాదాపుగా రోజుకు 30 గ్రాముల వరకు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఐదారు ఎండు ద్రాక్ష, రెండు అంజీరా, నాలుగు జీడి పప్పు, నాలుగు బాదాం, పిస్తాలను చేర్చుకుని తినొచ్చు. అయితే వీటిని ఇన్నే తినాలని లెక్కగా చెప్పడానికి లేదు. వాటి ఆకారాన్ని బట్టి బరువులో తేడా ఉంటుంది. కాబట్టి అన్నీ కాసిన్ని చొప్పున వేసుకుని 30 గ్రాములు వచ్చేలా తూకం తూసుకుంటే సరిపోతుంది. రెండు భోజనాలకు మధ్యన ఉండే వ్యవధిలో వీటిని తినడం వల్ల నీరసం రాదు.

ఆకు కూరలు, ఆకు పచ్చటి కూరగాయలు :

ఆకు పచ్చని కూరగాయల్ని, ఆకు కూరల్ని కూడా మనం రోజూ కొన్ని తినాలి. రెండు బ్రోకలీ ముక్కలు, రెండు టేబుల్‌ స్పూన్ల ఉడికించిన ఆకు కూరలు, రెండు స్పూన్‌ల స్ప్రింగ్‌ ఆనియన్స్‌ లాంటి వాటిని ఒక్కసారి ఉడికించి తీసుకోవాలి. వాటికి సమానమైన భాగంలో బచ్చలి, పాలకూర, మెంతి కూర లాంటి ఇతర ఆకులు ఉండేలా చూసుకోవాలి. వీటిని ఎక్కువగా ఉడికించడం, వేయించడం చేయకూడదు. ఒక్కసారి ఉడికించడం, లేదంటే స్టిర్‌ ఫ్రై చేసుకుని తినడానికి ప్రయత్నించాలి. మనకు ఎక్కువగా బాగా వండుకుని కూరలు తినడం అలవాటు కదా. అప్పుడు పోషకాలు వాటిలో చాలా వరకు తగ్గిపోతాయి. అందుకని ఇంత కూర తినాలి అని చెప్పడానికి వీలు కాకుండా ఉంటుంది.

జ్యూసులు, స్మూతీలు :

మనం తాజా పండ్లు, కూరగాయలతో రకరకాల జ్యూసులు, స్మూతీల్లాంటివి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. అవి 150 మిల్లీలీటర్ల వరకు సరిపోతుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని మిక్సీ చేయడం కంటే సాధారణ పండునే తినడం మంచిది.

Whats_app_banner