Heart health tips: ఇలా చేస్తే మీకు గుండె పోటు రాకపోవచ్చు..
యువకులు, మధ్య వయస్కుల్లో ఇటీవల గుండె పోట్లు బాగా పెరిగిపోయాయి. గుండె పోటు రాకుండా ఉండాలంటే ఈ జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తరచూ గుండె పోటు వార్తలు మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? యువకులు గుండె పోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు తరచూ చూస్తున్నాం. అలాగే మధ్య వయస్కులు, వృద్ధులు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కదలిక లేని జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడిని తగ్గించుకోలేకపోవడం వంటివన్ని గుండెను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల చాలా మంది ప్రముఖులు గుండె పోటుకు గురై చనిపోయిన విషయం మనం జీవనశైలి మార్పులు చేసుకోవాలని చెప్పకనే చెబుతోంది. నటుడు సతీష్ కౌషిక్ మరణం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫ్రెండ్ ఇంట్లో ఉన్న సతీష్ కౌషిక్ అర్ధరాత్రి తనకు అస్వస్తతగా ఉందని, హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరారు. మార్గమధ్యంలోనే గుండె పోటుకు గురై చనిపోయారు.
‘హార్ట్ రిథమ్ అసాధారణంగా మారడం వల్ల ఆకస్మికంగా గుండె పోటుకు గురై మరణం సంభవిస్తుంది. హార్ట్ రిథమ్ అసాధారణ వేగం పెరగడం లేదా అసాధారణంగా వేగం తగ్గడం వంటి కారణాల వల్ల మారుతుంది. ఈ రెండు పరిస్థితుల్లో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోవడమే ఇందుకు కారణం. ఒక ధమని అకస్మాత్తుగా మూసుకుపోయినప్పుడు అసాధరణ రిథమ్ ఏర్పడుతుంది. దీని వల్ల గుండె పోటు సంభవిస్తుంది.. ’అని మరెంగో ఏషియా హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ రాకేష్ రాయ్ సాప్ర వివరించారు.
గుండెను రక్షించుకోవడానికి టిప్స్
ఫోర్టిస్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ పవన్ కుమార్ పి రాసల్కర్ హెచ్‌టీ డిజిటల్‌తో మాట్లాడుతూ గుండెను పదిలంగా కాపాడుకునేందుకు కొన్ని సూచనలు చేశారు.
1. Maintain a healthy weight: బరువును అదుపులో ఉంచుకోవాలి
అధిక బరువు ఉండడం, ఊబకాయం ఉండడం హార్ట్ ఎటాక్ రిస్క్ పెంచుతుంది. హెల్తీ డైట్ ఫాలో అవడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ ఉండడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఒక వ్యక్తి ఎత్తు, వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి బరువు ఎంత ఉండాలో నిర్ధారించవచ్చు.
2. Eat a heart-healthy diet: హెల్తీ డైట్ అవసరం
పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం గుండెకు మేలు చేస్తుంది. తేలికైన ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్, అధిక కొవ్వులు గల ఆహారానికి దూరంగా ఉండాలి.
3. Exercise regularly: క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. కనీసం రోజుకు 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
4. Manage stress: ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి
దీర్ఘకాలికంగా ఒత్తిడి కలిగి ఉండడం గుండె జబ్బుల ముప్పు పెంచుతుంది. స్ట్రెస్ మేనేజ్ చేసుకునేందుకు గల మార్గాలను గుర్తించి వాటిని అమలు చేయాలి. యోగా, ధ్యానం, తగినంత నిద్ర ఈ దిశగా మేలు చేస్తాయి.
5. Avoid smoking: పొగ మానేయండి
స్మోకింగ్ మానేస్తే మీ గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. అందువల్ల స్మోకింగ్ మానేయడానికి గల మార్గాలను వెంటనే గుర్తించండి. వాటిని అమలు చేయండి.
6. Get regular check-ups: తరచూ హెల్త్ చెకప్
తరచుగా హెల్త్ చెకప్‌కు వెళ్లడం మంచిది. గుండె పనితీరులో అసాధారణతలు కనిపెడితే తగిన చికిత్స తీసుకోవవచ్చు. ముఖ్యంగా హైబీపీ, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఉన్న వారు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
సంబంధిత కథనం