Foods For Kidney Health: ఈ శాకాహారాలతో కిడ్నీల ఆరోగ్యానికి అండ..
Foods For Kidney Health: కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడే శాకాహార ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఆహారంలో చేర్చుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడినట్లే. అవేంటో చూడండి.
మూత్ర పిండాలు మన శరీరాన్ని శుభ్ర పరిచే ఫిల్టర్లని చెప్పవచ్చు. ఇవి రోజుకు దాదాపుగా 200 లీటర్ల రక్తాన్ని వడగట్టి వ్యర్థాలను బయటకు నెట్టి వేసే పని చేస్తూ ఉంటుంది. వీటి పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా ఈ వ్యర్థాలన్నీ మనలో ఉండిపోయి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. అందుకనే వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది.. కొన్ని శాకాహారాలను తరచుగా తినడం వల్ల అవి మన కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి సహకరిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
ఉల్లిపాయ :
ఉల్లి చేసే మేలు తల్లైనా చేయదని మనకో సామెత ఉంది. మనకు రోజూ ఉల్లిపాయ లేకుండా కూరే పూర్తికాదు. ఇలాంటి ఉల్లిలో కొన్ని రకాల ఫ్లవనాయిడ్లు ఉంటాయి. దీనిలో పొటాషియం శాతం తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు అన్నింటి వల్లా ఇది కిడ్నీ ఫ్రెండ్లీ శాకాహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు రావంటున్నారు.
యాపిల్ :
ఈ పండులో వాపుల్ని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీనిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం ఇబ్బందులూ తగ్గుతాయి. ఇవన్నీ కూడా మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయి.
క్యాబేజ్ :
కొన్ని కూరగాయలు, పండ్లలో ఉండే ఫైటో కెమికల్స్ అనేవి క్యాబేజ్‌లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. గుండె ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. ఇన్ని ఉపయోగాలుండే క్యాబేజీలో విటమిన్ కే, సీ, బ6, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థాలు లాంటివి ఉంటాయి. అయితే ఇందులో ముఖ్యంగా పొటాషియం తక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని కిడ్నీ ఫ్రెండ్లీ ఆహారం అని చెబుతారు.
కాలీ ఫ్లవర్ :
కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల్లో కాలీ ఫ్లవర్ ఒకటి. దీనిలో విటమిన్ సీ, ఫోలేట్, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే కొన్ని సమ్మేళనాలు కాలేయంలో పేరుకుపోయిన విష పదార్థాల్ని బయటకు పంపించి వేయడంలో సహాయపడుతుంది. దీన్ని కూరగానే కాకుండా రకరకాల స్నాక్స్‌లాగానూ చేసుకుని తినవచ్చు.
వెల్లుల్లి :
కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కూడా కీలకంగా పని చేస్తుంది. దీనిలో వాపుల్ని తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే కొలస్ట్రాల్‌ని తగ్గించడంలోనూ ఇది ప్రముఖంగా పని చేస్తుంది. దీనిలో రక్తం గడ్డలు కట్టకుండా చేసే లక్షణాలూ ఉన్నాయి. అయితే దీన్ని వండి వేడి చేసి తినడం వల్ల ఈ లక్షణాలు కొద్దిగా తగ్గుతాయి. కానీ పూర్తిగా పోవు.