Cleaning Cauliflower: మీరు కాలీ ఫ్లవర్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు? సరైన పద్ధతిదే..
Cleaning Cauliflower: క్యాలీ ఫ్లవర్ సరిగ్గా శుభ్రం చేయకపోతే దాంట్లో చిన్న చిన్న పురుగులు అలాగే ఉండిపోతాయి. అది అనారోగ్యకరం. దాన్ని శుభ్రం చేయాల్సిన పద్ధతేంటో తెలుసుకోండి.
కాలీఫ్లవర్.. చాలా మందికి ఇదో ఇష్టమైన కూరగాయ. కూర్మా, పకోడీ, మంచూరియా, కూరలు చేసి ఇలా రకరకాలుగా దీన్ని తినేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సీజన్‌లో సాధారణంగా ఇది ఎక్కువగా మార్కెట్లలో దొరుకుతూ ఉంటుంది. ఇది పువ్వులా ఉండటం వల్ల సహజంగానే దీనిలో ఎక్కువగా మలినాలు చేరే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా ఈ పంటకు ఎక్కువగా పురుగులు ఆశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిపై నేరుగా పురుగుల మందుల్ని రైతులు పిచికారీ చేస్తుంటారు. అయినా సరే కొన్ని సార్లు కొనుక్కున్న తర్వాత మనం కట్ చేసి చూస్తే వాటి లోపల్లోపల చిన్న చిన్న పురుగులు ఉండటాన్ని గమనిస్తూ ఉంటాం. మరి ఈ మలినాలు, పురుగులు, పురుగు మందులు... వీటన్నింటినీ కాలీఫ్లవర్ పై నుంచి తీసివేయాలంటే దీన్ని కచ్చితంగా బాగా శుభ్రం చేసుకోవాల్సిందే. మరి మీరు సరిగ్గానే శుభ్రం చేసుకుంటున్నారో లేదో ఓ సారి చెక్ చేసుకోండి. ఇక్కడ దీన్ని స్టెప్ బై స్టెప్ ఎలా శుభ్ర పరచాలో ఉంది. చదివేయండి.
స్టెప్ 1:
ముందుగా గోబీ కింద ఆకులు తీసేసి వాటిని చిన్న చిన్న పువ్వులుగా వేరు చేయాలి. వాటిని చిల్లల జల్లెడలో వేసి ఓసారి ధారగా వెళుతున్న కుళాయి నీళ్ల కింద పెట్టి శుభ్రంగా కడగాలి. అప్పుడు వాటిపై పేరుకున్న దుమ్ము, మలినాలు వదిలిపోతాయి.
స్టెప్ 2:
ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. వాటిని బాగా వేడిగా కాగనివ్వాలి. అప్పుడు ఆ నీటికి ఉప్పును చేర్చాలి. అది కరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకుని గ్యాస్ కట్టేయాలి. ఆ వేడి నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి తర్వాత నీటిని వడకట్టేయాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ లోపల్లోపల దాగిన సూక్ష్మ జీవులు, పురుగులు, గుడ్లు అన్నీ నశిస్తాయి.
స్టెప్ 3:
ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టిన కూలింగ్ వాటర్, లేదా చల్లని నీళ్లని తీసుకోవాలి. అందులోకి ఆ వేడి వేడిగా ఉన్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేయాలి. అప్పుడు ఈ ముక్కలు కూర వండటానికి ముందే ఎక్కువగా ఉడికి, మెత్తగా అయిపోకుండా ఉంటాయి. దాని రుచి కూడా ఎక్కువ పోకుండా ఉంటుంది.
స్టెప్ 4:
కూలింగ్ వాటర్ నుంచి కాలీఫ్లవర్ ముక్కల్ని తీసి కాటర్ వస్త్రం మీద పరిచి నీరు లేకుండా గాలికి ఆరబెట్టాలి. ఈ నాలుగు స్టెప్స్ పూర్తయితే అయితే అప్పుడు ఇది వాడుకోవడానికి సిద్ధమైందని అర్థం. ఇప్పుడు కావాలనుకుంటే దీన్ని కూర చేసుకోవచ్చు. లేదంటే డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడేసుకోవచ్చు.