Vellulli Soup: చలికాలంలో వెల్లుల్లి సూప్ రెసిపీ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది
Vellulli Soup: చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి సూప్‌ను ఒకసారి ప్రయత్నించండి. ఈ రెసిపీ చాలా సులువు.
వెల్లుల్లి సూప్ రెసిపీ
Vellulli Soup: చలికాలం వచ్చిందంటే దగ్గు, జలుబు, జ్వరము దాడి చేస్తుంటాయి. ఊపిరిత్తిత్తులకు కఫం పట్టడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచేది వెల్లుల్లి సూప్. ఈ గార్లిక్ సూప్ రెసిపీ చాలా సులువు. దీన్ని తయారు చేయడానికి వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళదుంప, జీలకర్ర వంటివి ఉంటే చాలు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. మిగతా సూపులతో పోలిస్తే చలికాలంలో ఈ గార్లిక్ సూప్ తాగడం అన్ని విధాలా మంచిది. దీన్ని సులువుగా ఎలా తయారు చేయాలో చూద్దాం.
వెల్లుల్లి సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
బంగాళదుంప - ఒకటి
జీలకర్ర - అర స్పూను
ఆలివ్ నూనె - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
తాజా క్రీము - అరకప్పు
చిల్లీ ఫ్లేక్స్ - ఒక స్పూను
ఒరెగానో - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి సూప్ రెసిపీ ఇలా చేయండి
1. ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టి ఆలివ్ నూనె వేయండి. జీలకర్ర వేసి వేయించండి.
2. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి నిమిషం పాటు వేయించండి.
3. తర్వాత వెల్లుల్లి తరుగును వేసి మరో నిమిషం పాటు వేయించండి.
4. ఇప్పుడు సన్నగా తరిగిన బంగాళదుంపలను వేయండి. రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసి ఒక కప్పు నీళ్లు వేసి మూత పెట్టండి.
5. పావుగంట నుంచి 20 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి. బంగాళదుంప మెత్తగా ఉడికిపోవాలి.
6. తర్వాత మూత తీసి ఫ్రెష్ క్రీమ్‌ను వేయండి. తాజా క్రీము సూపర్ మార్కెట్లలో లభిస్తుంది.
7. రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి.
8. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా సూప్‌లా చేయండి. అవసరమైతే నీటిని కలపండి.
9. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పైన చిల్లి ఫ్లేక్స్ లేదా ఒరెగానోతో గార్నిష్ చేయండి.
10. దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే గొంతులో ఇన్ఫెక్షన్ వంటివి తగ్గుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.