Vellulli Karam Podi: వెల్లుల్లి కారంపొడి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది
Vellulli Karam Podi: వెల్లుల్లి కారం పొడి రెసిపీ చాలా సులువు. దీన్ని అన్నంలోకి, టిఫిన్లలోకి కూడా తినవచ్చు.
Vellulli Karam Podi: తెలుగువారికి పచ్చళ్ళు, పొడులు అంటే అమితమైన ప్రీతి. అందులో ఒకటి వెల్లుల్లి కారంపొడి. ఎంతోమందికి ఇది ఇష్టమైన రెసిపీ. కానీ అందరికీ దీన్ని చేయడం రాదు. పక్కా కొలతలతో చేస్తే దీని రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుంటే ఏడాదంతా వస్తుంది అన్నంలోకైనా ఇడ్లీ, దోస వంటి టిఫిన్లలోకి కూడా ఈ వెల్లుల్లి కారంపొడి టేస్టీగా ఉంటుంది. దీన్ని కేవలం పావుగంటలో చేసేయొచ్చు. కాబట్టి వెల్లుల్లి కారంపొడి రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.
వెల్లుల్లి కారంపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు
వెల్లుల్లిపాయలు - 20 రెబ్బలు
ఎండుమిర్చి - 15
ధనియాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
మినప్పప్పు - రెండు స్పూన్లు
కరివేపాకు - గుప్పెడు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - ఒక స్పూను
వెల్లుల్లి కారం పొడి రెసిపీ ఇదిగో
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మినప్పప్పును వేసి వేయించాలి.
2. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించాలి.
3. అవి వేగాక ఎండుమిర్చి, కరివేపాకులు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.
4. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతోనే తీసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలను, ఉప్పును వేసి మిక్సీ చేయాలి.
5. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పదార్థాలను వేసి పొడిలా చేసుకోవాలి. అంతే వెల్లుల్లి కారంపొడి రెడీ అయినట్టే.
6. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది.
7. ఎక్కువ రోజులకు నిలువ చేసుకోవాలని అనుకునే వాళ్ళు అధిక క్వాంటిటీతో ఈ పొడిని చేసుకోవాల్సి ఉంటుంది.
8. ఇడ్లీలో ఈ వెల్లుల్లి కారంపొడి చాలా టేస్టీగా ఉంటుంది.
9. వేడివేడి అన్నంలో ఈ వెల్లుల్లి కారంపొడిని వేసుకొని, అర స్పూను నెయ్యి కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది.
10. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
11. కాబట్టి ప్రతిరోజూ అన్నంలో ఒక ముద్ద ఈ వెల్లుల్లి కారంపొడిని కలుపుకొని తింటే మంచిది.
వెల్లుల్లి తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు ఎక్కువ. వెల్లుల్లిని తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. రక్తనాళాలను శుభ్రపరడానికి వెల్లుల్లిలోని పోషకాలు సహకరిస్తాయి. కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. వెల్లుల్లిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. వివిధ రకాల చర్మ వ్యాధుల బారిన పడకుండా పోరాడేందుకు ఇందులో ఉంటే ఎంజైమ్ లు సహాయపడతాయి. హైబీపీ ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. వెల్లుల్లి తినడం వల్ల అధికరక్తపోటు అదుపులో ఉంటుంది. కాబట్టి గుండె పోటు వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. చలికాలంలో వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటివి రాకుండా ఉంటాయి.