Good Cholesterol: గుండె ఆరోగ్యం కోసం మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుకునే మార్గాలు..
Good Cholesterol: మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో, శారీరక శ్రమలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోండి.
కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే ఒక కొవ్వు రూపం. విటమిన్లు, కేలరీలు మనలో నిల్వ ఉండి అవసరమైనప్పుడు కరిగి శరీరానికి పనికి రావాలంటే కొలెస్ట్రాల్ అవసరం. అలాగే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి అవసరమైన పదార్థాలను తయారు చేసుకోవడానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. అందుకనే కాలేయం దీన్ని తయారు చేసి శరీరంలో నిల్వ చేస్తుంది. అయితే ఇందులో మంచి కొలెస్ట్రాల్(హెడీఎల్), చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్) అని రెండు రకాలు ఉంటాయి. శరీరంలో ఎప్పుడూ మంచి కొలెస్ట్రాల్ నిల్వలు ఎక్కువగా ఉంటే మనం మరింత ఆరోగ్యంగా ఉంటాం. గుండె జబ్బుల్లాంటివి రాకుండా ఉంటాయి. మరి చెడు కొలస్ట్రాల్ నిల్వలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ నిల్వలు పెరగాలంటే కొన్నింటిని అలవాటు చేసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి నూనెలు వాడాలి :
సాధారణంగా మనం తినే నూనెల ద్వారానే మనలోకి ఎక్కువ కొలెస్ట్రాల్ చేరుతుంది. అందుకనే నూనెలు ఆరోగ్యకరమైనవనిగా ఉండాలి. ఎక్కువగా ఆలివ్ ఆయిల్‌ని వాడమని వైద్యులు సూచిస్తున్నారు. దీనిలో మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీని వాడకంపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఆలివ్ ఆయిల్ వాడే ఎనిమిది లక్షల మందిపై జరిగిన అధ్యయనాల్లో గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గినట్లు తేలింది. అలాగే ఆహారంలో కొబ్బరి నూనె వాడకమూ పెంచుకోవాలని అంటున్నారు. దీని వల్ల ఆకలి, జీవ క్రియ రేటు పెరుగుతుందని చెబుతున్నారు. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. రిఫైన్డ్ ఆయిల్స్ జోలికి పోవొద్దని సూచిస్తున్నారు.
తక్కువ పిండి పదార్థాలు తినాలి :
తక్కువ కార్బోహైడ్రేట్‌లు, ఎక్కువ ప్రొటీన్లు, మంచి కొవ్వులు ఉండే కీటోజెనిక్ డైట్లను పాటించడం వల్ల శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ పిండి పదార్థాలను తినే వారిలో హెడీఎల్ స్థాయిలు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.
రోజూ వ్యాయామం చేయాలి :
మంచి ఆహారం తీసుకోవడంతో పాటుగా రోజూ వ్యాయామం చేయడం అనేది గుండె జబ్బులను దరి చేరనీయదు. ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేసే వారిలో హెచ్‌డీఎల్ ఎంతో సానుకూల ప్రభావాలను చూపుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వీరిలో బలోపేతం అవుతాయి. వారానికి నాలుగు రోజులైనా వ్యాయామాలను తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
బరువును నియంత్రణలో ఉంచుకోవాలి :
మన ఎత్తుకు తగినంత బరువును మాత్రమే కలిగి ఉండేలా చూసుకోవాలి. అందుకోసం అటు ఆహారం, ఇటు వ్యాయామం విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. మద్యం, ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటన్నింటినీ పాటించడం వల్ల మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
టాపిక్