TGSRTC MD Sajjanar : త్వరలో టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ, గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్-hyderabad tgsrtc md sajjanar says will recruit 3 thousand post for new buses ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Md Sajjanar : త్వరలో టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ, గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్

TGSRTC MD Sajjanar : త్వరలో టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ, గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్

HT Telugu Desk HT Telugu

TGSRTC MD Sajjanar : తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకువస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.

త్వరలో టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలు భర్తీ, గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్

TGSRTC MD Sajjanar : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స‌జ్జనార్ అన్నారు. ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఆయన నివాళులు అర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భ‌ద్రతా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు.

ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు పాత్ర చిరస్మరణీయం

ఈ సందర్భంగా స‌జ్జనార్ మాట్లాడుతూ.......తెలంగాణ తొలి, మ‌లి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తున్నామని అయన అన్నారు. “ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు " మేము సైతం " అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారని గుర్తుచేశారు. దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచిందన్నారు. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది అని సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి - మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్పూర్తితో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతోందన్నారు. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే......ప్రస్తుతం 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.

త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి......ఉద్యోగులకు 21 శాతం ఫిట్మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు.గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

సంబంధిత కథనం