alcohol: మీరిక మందు తాగడం మానాల్సిన క్షణం వచ్చిందని చెప్పే సంకేతాలివే.. లేదంటే తప్పదు ప్రమాదం
Alcohol: శరీరం ఆల్కహాల్ కు బానిస అయిపోయింది అని చెప్పే లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి కనిపిస్తే వెంటనే ఆల్కహాల్ మానేయాల్సిందే.
మాటలో అస్పష్టత, సమన్వయం లేని కదలికలు, నిలకడ లేకపోవడం లాంటి లక్షణాల వల్ల ఒక మనిషి ఆల్కహాల్ తాగారని చెప్పొచ్చు. కానీ ఆల్కహాల్‌కు అడిక్ట్ అయ్యారా అనేది అలా చూసి చెప్పలేం. కొన్ని లక్షణాలు కనిపిస్తే ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నట్లే. ఇవి కనిపిస్తే వెంటనే ఆల్కహాల్ తాగడం మానేయాలని అర్థం. లేదంటే వ్యసనంలా మారిపోయి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
మానసిక లక్షణాలు:
మీరే ఆల్కహాల్ సేవిస్తున్నా, మీ ఇంట్లో వాళ్లకు ఈ అలవాటు ఉన్నా వాళ్లలో ఈ కింది మార్పులు వచ్చాయంటే వాళ్లకది వ్యసనం అయ్యిందని అర్థం. వెంటనే ఈ లక్షణాలు గమనించి చర్యలు తీసుకోవాలి.
1. ఆల్కహాల్ తాగడం వ్యసనంలా మారిపోతే, ఆల్కహాల్ తాగే అవకాశం లేనప్పుడల్లా చెమటలు పట్టడం, వికారంగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మీరు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యారని చెప్పే సంకేతాలు.
2. ఇంతకముందు మీరు తాగేదాని కన్నా ఎక్కువ తాగితేనే ఇంతకముందు వచ్చే ఫీలింగ్, సంతృప్తి మీకు దొరుకుతుందీ అంటే మీ శరీరం ఆల్కహాల్ కు అలవాటు పడినట్లే. అలాగే మీరు తాగే పరిమాణం మీద నియంత్రణ లేకుండా అయిపోతే అది కూడా అడిక్షన్ సూచిస్తుంది.
3. మీరు అనుకున్న వెంటనే తాగకుండా ఉండలేరు కాబట్టి.. ఇంట్లో, ఆఫీసుల్లో, కార్లలో సీక్రెట్ ప్లేసుల్లో ఆల్కహాల్ దాచి పెట్టడం మొదలు పెడతారు. ఇది నిర్లక్ష్యం చేయదగ్గ లక్షణం కాదు.
4. సందర్భానుసారంగా ఆల్కహాల్ తాగుతారేమో. అలా కాకుండా బాధ, దు:ఖం, ఆందోళన, డిప్రెషన్, కష్టం ఏం వచ్చినా ఆల్కహాల్ నయం చేస్తుంది అనుకుని తాగడానికి అలవాటు పడితే కష్టమే. అంటే మానసికంగా ఆల్కహాల్ మీద ఆధారపడినట్లు. దీనివల్ల కుటుంబ సంబంధాలు కూడా బలహీనమవుతాయి.
5. మీరు ఆల్కహాల్ సేవించినప్పుడు ఏం జరిగిందో పూర్తిగా మర్చిపోతే ఇది ప్రమాదకర సంకేతం. మీ మెదడు ఆల్కహాల్ తాగడం వల్ల బలహీనపడిందని దీనర్థం. ఆల్కహాల్ తాగడం వల్ల మతిమరుపు రావడం చాలా పెద్ద విషయంగా పరిగణించాలి. దానివల్ల క్రమంగా మెదడు దెబ్బతినవచ్చు.
6. స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ఆల్కహాల్ తాగేవాళ్లుంటారు. అది కూడా మంచి అలవాటేమీ కాదు. కానీ రహస్యంగా, ఒంటరిగా కూర్చుని ఆల్కహాల్ తాగడం మొదలుపెడితే మాత్రం ఏదో తేడాగా జరుగుతుందనే అర్థం. వెంటనే ఈ అలవాటు మానుకోవాల్సిందే.
7. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో తరచూ గొడవ పడటం, ఇంటి విషయాలు పట్టించుకోకపోవడం లాంటి అలవాట్లు ఆల్కహాల్ అడిక్షన్ సంకేతాలు. మీ ప్రియమైన వాళ్లని ఒక దుర్వ్యసనం కోసం దూరం చేసుకోవడం ఏమాత్రం సరికాదు.
8. ఇన్ని అనర్థాలున్నాయని తెలిసినా కూడా ఆల్కహాల్ మానేయకపోతే మీరు దానికి బానిస అయినట్లే అర్థం.
లివర్ దెబ్బతినడం, అధిక రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు రావొద్దంటే వెంటనే ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడాలి. దీంతో పాటూ కుటుంబసమస్యలు, ఆర్థిక సమస్యలకు ఆల్కహాల్ వ్యసనం కారణమవుతుంది. ఇంత మహమ్మారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
శారీరక లక్షణాలు:
ఆల్కహాల్ తాగాలనిపించినప్పుడు దొరక్కపోతే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఇవన్నీ ఆల్కహాల్ అడిక్షన్ సంకేతాలు.
చెమటలు పట్టడం
వణకడం
వికారం
తలతిప్పడం
మూర్చ లేదా స్పృహ తప్పడం
వాంతులవ్వడం
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆల్కహాల్ దూరం చేయండి. మీవల్ల కాకపోతే వైద్యుల్ని సంప్రదించండి.