Know about Ivy Gourd: మతిమరుపు వస్తుందని దొండకాయ తినట్లేదా? అయితే ఇది చదవండి..-know about ivy gourd and its different health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know About Ivy Gourd: మతిమరుపు వస్తుందని దొండకాయ తినట్లేదా? అయితే ఇది చదవండి..

Know about Ivy Gourd: మతిమరుపు వస్తుందని దొండకాయ తినట్లేదా? అయితే ఇది చదవండి..

Koutik Pranaya Sree HT Telugu
Oct 15, 2023 11:20 AM IST

Know about Ivy Gourd: దొండకాయలు తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుందని దాన్ని తినడం పూర్తిగా మానేశారా? అయితే దాంట్లో ఉండే మరెన్నో పోషకాల గురించి తెలుసుకోండి.

దొండకాయ లాభాలు
దొండకాయ లాభాలు (https://creativecommons.org/licenses/by-sa/4.0)

కొంతమంది దొండకాయ కూరకు ఆమడ దూరంలో ఉంటారు. పిల్లలకు పెట్టడానికైతే అస్సలు ఆసక్తి చూపరు. వీటిని తినడం వల్ల మతి మరుపు, మందబుద్ధి లాంటివి వస్తాయని కొంత మంది నమ్ముతుంటారు. కొన్ని తరాలుగా ఈ నమ్మకాలు జనాల్లో పాతుకుపోయి ఉన్నాయి. అయితే ఇలా భావించడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమీ లేవు సరికదా.. దొండకాయ తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. వీటిని తినడం వల్ల మనకు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

దొండకాయ తింటే లాభాలు:

  • దొండకాయలో విటమిన్‌ బీ1, బీ2, బీ3, బీ6, బీ9లు ఎక్కువగా ఉంటాయి. అలాగే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, పాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఇవి నివారిస్తాయి.
  • దీనిలో డైటరీ ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనిలో థయామిన్‌ అనేది ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా మరుస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ సజావుగా జరుగుతుంది. పేగుల నుంచి వ్యర్థ పదార్థాలు, పేరుకున్న విష పదార్థాలు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. సుఖ విరోచనం అవుతుంది. తద్వారా మొత్తం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు, గ్యాస్‌ వంటి సమస్యలూ తగ్గుముఖం పడతాయి.
  • దీనిలో సమృద్ధిగా బీటా కెరోటిన్‌ లభిస్తుంది. అది విటమిన్‌ ఏగా మారి దృష్టి లోపాలను సరిచేస్తుంది.
  • బరువు తగ్గాలని అనుకునే వారికి దొండకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. జీవక్రియ రేటును పెంచి కొవ్వు కణాలను కరిగించడంలో ఇది సహకరిస్తుంది.
  • ఎక్కువగా ఐరన్‌ లోపంతో బాధ పడేవారు దొండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియా(రక్త లేమి) లాంటి వాటితో బాధ పడే వారికి చక్కగా పని చేస్తుంది.
  • చాలా మంది దొండకాయ తింటే మతిమరుపు, మందబుద్ధి వస్తాయని అనుకుంటారు. అయితే ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి అల్జీమర్స్‌ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా దొండకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది. అందుకనే దీన్ని డయాబెటిక్‌లకు ఔషధంగా చెబుతారు.
  • కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్యలతో చాలా మంది సతమతం అవుతుంటారు. అలాంటి వారు వారానికి రెండు సార్లైనా దొండకాయ తినాలి. ఇది రాళ్లు ఏర్పడటాన్ని నియంత్రిస్తుంది.
  • దీంట్లో ఉండే ఆల్కలాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లలాంటివి అలర్జీలను దరి చేరనివ్వవు. ఒక వేళ ఎవరైనా అలర్జీలతో బాధ పడుతున్నట్లయితే ఇవి వాటిని తగ్గిస్తాయి.
  • దొండకాయ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ ఏర్పడటాన్ని నిరోధిస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్‌గా పని చేస్తుంది. ఆస్తమా, జాండిస్‌, లెప్రసీ లాంటి వాటి లక్షణాలను తగ్గిస్తుంది.

Whats_app_banner