Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు!-symptoms of kidney stones warning signs of stones in kidney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Symptoms Of Kidney Stones Warning Signs Of Stones In Kidney

Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు!

Chatakonda Krishna Prakash HT Telugu
May 30, 2023 04:01 PM IST

Kidney Stones Symptoms : మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్టు అనుమానించవచ్చు. అలా కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఎలాంటి సంకేతాలు ఉంటాయంటే..

Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు! (Shutterstock)
Kidney Stones: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు! (Shutterstock)

Kidney Stones Symptoms : కిడ్నీల్లో రాళ్ల సమస్య చాలా మందిలో ఇటీవల పెరుగుతోంది. అయితే, కొందరికి లక్షణాలు ఉన్నా.. అవి కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చినవి గుర్తించలేకున్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకోలేకున్నారు. ఇలా ఆలస్యం చేస్తే సమస్య జఠిలం అయ్యే ప్రమాదం ఉంటుంది. మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే కిడ్నీల్లో రాళ్లను ప్రాథమిక దశలోనే గుర్తించాలి. అవి ఏర్పడ్డాయని గుర్తించేలా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడి ఉండొచ్చని అనుమానించాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకుంటే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఎలాంటి శరీరంలో లక్షణాలు, సంకేతాలు ఉంటాయో ఇక్కడ చూడండి.

మూత్రవిసర్జన చేసేటప్పుడు..

కిడ్నీలో రాళ్లు ఉంటే మూత్రవిసర్జన (యూరినేషన్) చేసే సమయంలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. మూత్రనాళం వద్ద నొప్పిగా అనిపిస్తుంది. మంటగా కూడా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ సంప్రదించి, తగిన టెస్టులు చేయించుకోవాలి.

ఈ శరీర భాగాల్లో నొప్పి

కిడ్నీలో రాళ్లు ఏర్పడితే కడుపు కిందిభాగంలో తీవ్రమైన నొప్పి తరచూ వస్తుంది. నడుము ఒకవైపు ఎక్కువగా నొప్పిగా ఉండడం కూడా దీనికి సంకేతమే. అలాగే శరీరంలో ఓ పక్క మొత్తం నొప్పిగా అనిపిస్తుంటుంది. ఒకవేళ రాళ్లు పెద్దవైతే నొప్పి తీవ్రంగా ఉంటుంది.

మూత్రం తేడాగా అనిపిస్తుంది

కిడ్నీలో రాళ్లు ఏర్పడితే చాలాసార్లు మూత్రంలో రక్తం పడుతుంది. ఈ రక్తం వేరే రంగుల్లోనూ ఉండే ఛాన్స్ ఉండటంతో గుర్తించడం కష్టమవుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే యూరిన్ వాసన కూడా తేడాగా ఉంటుంది. వాసన అధికంగా వస్తుంది.

కారణం లేకుండా వాంతులు, వికారం

ఎలాంటి ఫుడ్ పాయిజన్ కాకున్నా.. ఇతర అనారోగ్యం ఏమీ లేకున్నా వాంతులు తరచూ వస్తున్నాయంటే అందుకు కిడ్నీలో రాళ్లు కూడా కారణం కావొచ్చు. అకారణంగా వికారంగా అనిపించడం కూడా దీని లక్షణమే. అందుకే ఇలాంటి సంకేతాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

మూత్రంలోని కొన్ని వ్యర్థ రసాయనాలు బయటికి వెళ్లకుండా పేరుకుపోవటం వల్ల మూత్రనాళాల్లో స్ఫటికాలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా కిడ్నీల్లోకి చేరతాయి. ఇలా కిడ్నీల్లో రాళ్లు పెద్దవవుతుంటాయి.

తగినంత నీరు తాగని వారిలో, ఊబకాయుల్లో, డయాబెటిస్ ఉన్న వారిలో, మాంసాహారం మోతాదుకు మించి విపరీతంగా తింటున్న వారిలో ఈ కిడ్నీల్లో రాళ్ల సమస్య ఎక్కువగా తలెత్తుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని ఏ మాత్రం సందేహం వచ్చినా వెంటనే సంబంధిత డాక్టర్‌ వద్దకు వెళ్లాలి. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు తేలితే చికిత్స తీసుకోవాలి. కొన్ని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే త్వరగానే ఈ సమస్య పరిష్కారమవుతుంది. ఒకవేళ ప్రారంభ దశలో కిడ్నీలో రాళ్లను నిర్లక్ష్యం చేస్తే.. సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి రావొచ్చు.

WhatsApp channel