Know about Soya: సోయా ఉత్పత్తులు పేగుల్ని ఆరోగ్యంగా చేస్తాయా? అవి తినడం మంచిదా కాదా?-know about health benefits of soya and its products ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Know About Soya: సోయా ఉత్పత్తులు పేగుల్ని ఆరోగ్యంగా చేస్తాయా? అవి తినడం మంచిదా కాదా?

Know about Soya: సోయా ఉత్పత్తులు పేగుల్ని ఆరోగ్యంగా చేస్తాయా? అవి తినడం మంచిదా కాదా?

HT Telugu Desk HT Telugu
Dec 14, 2023 07:00 PM IST

Know about Soya: సోయా, సోయా ఉత్పత్తుల్ని తినడం విషయంలో భిన్న ప్రశ్నలుంటాయి. కొందరు మంచిదంటే మరికొందరు హానికరం అంటారు. ఇంతకీ ఏది నిజమో తెల్సుకోండి.

సోయా ఉత్పత్తులు
సోయా ఉత్పత్తులు (freepik)

సోయాను మనం ఆహారంలో అనేక రకాలుగా వినియోగిస్తూ ఉంటాం. సోయా పాలు, సోయా చంక్స్‌, సోయా గింజలు, టోఫు లాంటి వాటిని ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా శాకాహారులు ప్రొటీన్‌ కోసం ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే సోయా, సంబంధిత ఉత్పత్తులు అన్నీ కూడా మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వీటిలో ఉండే ప్రోబయోటిక్స్‌ వల్ల మన పొట్ట, పేగులు ఆరోగ్యంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి తింటే మంచిది అని కొన్ని సార్లు, మంచిది కాదని కొన్ని సార్లు తరచుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే పేగుల విషయంలో మాత్రం ఇవి మంచే చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అదెలాగో చూసేద్దాం.

సోయా ఉత్పత్తుల గురించి తెల్సుకోండి..

వేగన్‌ డైట్‌ని అనుసరించే వారు చాలా మంది సోయా పాలను ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పేగుల్లో ఉండే కొన్ని సూక్ష్మ జీవుల సమూహాలను మైక్రోబీటా అని పిలుస్తూ ఉంటారు. ఒక నిర్దిష్టమైన చోట ఉండే సూక్ష్మ జీవుల సమూహాలను మైక్రోబీటాగా వ్యవహరిస్తారు. ఈ పాలు తాగడం వల్ల పేగుల్లో ఉండే ఈ సూక్ష్మ జీవులు వాటిలోని పోషకాలను తీసుకుంటాయి. వాటిని మైక్రోబీటా అవసరాలకు అనుగుణంగా మార్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఆ విధంగా సోయా పాల వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఇంకా ఇంకా వృద్ధి చెందుతాయి. ఫలితంగా పేగుల ఆరోగ్యం మెరుగు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాల ఉత్పత్తులకు బదులుగా వీటిని చాలా మంది వినియోగిస్తారు. అందువల్ల ప్రొటీన్‌ తగినంతగా లభించి కండరాలు బలంగా తయారవుతాయి. వీటిలో ఉండే పీచు పదార్థాల వల్ల మలబద్ధకం లాంటి సమస్యలూ తగ్గుముఖం పడతాయి.

పులియబెట్టిన సోయా ఉత్పత్తులు:

సోయా సాస్‌, టోఫు లాంటి పులియబెట్టిన సోయా ఉత్పత్తుల వల్ల పేగుల్లో ఉండే మంచి సూక్ష్మ జీవులు మరింతగా అభివృద్ధి చెందుతాయి. వీటిలో సహజంగా ప్రొటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి సూక్ష్మ జీవులకు శక్తితో పాటు నైట్రోజన్‌ను అధికంగా అందిస్తాయి. ఈ రెండు కారణాల వల్ల అవి మరింతగా అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సోయాను పులియ బెట్టి రకరకాల ఉప ఉత్పత్తులను తయారు చేయడానికి ఈస్ట్‌ లాంటి బ్యాక్టీరియాలను వాడుతుంటారు. ఇవి నేరుగా కడుపులోకి వెళ్లడం వల్ల అక్కడ ఇంకా సానుకూల వాతావరణం ఏర్పడి అవి మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.

సోయా ఉత్పత్తుల్లో ఉండే పోషకాలు:

సోయా ఉత్పత్తులను తినడం వల్ల విటమిన్‌ సీ, ఫోలేట్‌, కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్‌, పీచు పదార్థాలు తదితరాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్ల లక్షణాలూ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిపి పేగుల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.

WhatsApp channel