Non dairy milks: వీగన్లకు ఇవిగో.. బోలెడు రకాల పోషకాల పాలు
Non dairy milks: గేదెపాలు, ఆవుపాలు తాగని వారికి కొన్ని రకాల వీగన్ పాల ఆప్షన్లున్నాయి. ఇవి గింజల నుంచి తయారుచేసే రకాలు.అవేంటో చూడండి.
ఈ మధ్య కాలంలో శాకాహారుల్లో వేగన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వేగన్ డైట్ పాటించే వారు జంతు సంబంధమైన ఉత్పత్తులు ఏవీ తినరు. కేవలం మొక్కలకు సంబంధించిన ఉత్పత్తులనే ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అంటే ఆకు కూరలు, కూరగాయలు, గింజలు తదితరాలను తింటారు. అలాగే జంతువుల నుంచే వస్తాయి కాబట్టి వీరు అసలు పాలు, పాల ఉత్పత్తుల జోలికి వెళ్లరు. అందుకనే వీరు పాయసం లాంటివి చేసుకోవాలన్నా, టీ కాఫీల్లాంటివి పెట్టుకోవాలన్నా మొక్కల ఆధారితంగా వచ్చే కొన్ని పాల ఆప్షన్లు ఉన్నాయి. అవేంటో వాటి పోషక విలువలేంటో ఇప్పుడు చూసేద్దాం.
సోయా పాలు :
సోయా బీన్స్ గింజలను నానబెట్టి తీసే పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పెద్ద కప్పు సోయా పాలలో నాలుగు గ్రాముల పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. ఏడు నుంచి తొమ్మిది గ్రాముల ప్రొటీన్, నాలుగు గ్రాముల వరకు కొవ్వులు, 80 నుంచి 90 వరకు కేలరీలు లభిస్తాయి. ఆవు పాలకు ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. దీన్ని అన్ని వంటల్లోనూ, టీ కాఫీల్లోనూ ఉపయోగించవచ్చు. రుచి విషయంలో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. తయారీ బ్రాండ్లను బట్టీ రుచిలో తేడాలు ఉంటాయి.
కొబ్బరి పాలు:
కొబ్బరి, నీటిని ఉపయోగించి కొబ్బరి పాలను తయారు చేస్తారు. ఓ కప్పు కొబ్బరి పాలలో 45 కేలరీలు, నాలుగు గ్రాముల వరకు కొవ్వులు ఉంటాయి. ప్రొటీన్‌లు, పిండి పదార్థాలు చాలా తక్కువ. కాబట్టి అవి కావాలని అనుకునే వారు వేరే పాలను ఎంచుకోవడం మేలు. అయితే రక్తంలో చక్కర స్థాయిల్ని తగ్గించుకోవాలనుకునే వారికి, బరువును నియంత్రించుకోవాలని అనుకునే వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.
బాదం పాలు :
బాదం పాలల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు పాలతో పోలిస్తే వీటిలో కాల్షియం తక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. అందుకనే చాలా మంది బాదం పాల తయారీదారులు దీనిలో కాల్షియంని ప్రత్యేకంగా చేరుస్తారు. పాల ఉత్పత్తులను తినకపోవడం వల్ల శాకాహారులతో పోలిస్తే వేగన్లకు కాల్షియం తక్కువగా అందుతుంది. అందువల్ల వీరు ఎక్కువ పచ్చగా ఉండే కూరగాయల్ని తినాల్సి ఉంటుంది.
జీడిపప్పు పాలు :
జీడిపప్పు, నీటిని కలిపి జీడిపప్పు పాలను తయారు చేస్తారు. ఇది క్రీమీ టెక్చ్స్‌ర్‌లో ఉంటుంది. కాఫీలో క్రీమర్‌గా ఉపయోగపడుతుంది. డెజర్ట్‌లు చేసుకునేప్పుడు ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. ఒక కప్పు జీడిపప్పు పాలలో 25 నుంచి 50 క్యాలరీలు శరీరానికి అందుతాయి. రెండు నుంచి నాలుగు గ్రాముల కొవ్వు, ఒక గ్రాము వరకు ప్రొటీన్, రెండు గ్రాములలోపే పిండి పదార్థాలు ఉంటాయి. ప్రొటీన్‌లు ఎక్కువగా కావాలనుకునే వారు వేరే పాలను ఎంచుకోవడం మేలు.