Eating Cashew Daily: రోజూ జీడిపప్పు తినడం అనారోగ్యకరమా?-benefits of eating cashew nuts on daily basis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Cashew Daily: రోజూ జీడిపప్పు తినడం అనారోగ్యకరమా?

Eating Cashew Daily: రోజూ జీడిపప్పు తినడం అనారోగ్యకరమా?

HT Telugu Desk HT Telugu
Sep 12, 2023 01:01 PM IST

Eating Cashew Daily: జీడిపప్పు రోజూ తినే విషయంలో కొన్ని అపోహలుంటాయి. అది అనారోగ్యకరమనే ఆలోచనా ఉంటుంది. ఇంతకీ జీడిపప్పు రోజూ తినొచ్చో లేదో తెలుసుకోండి.

జీడిపప్పు
జీడిపప్పు (pexels)

మనం ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కొన్ని నట్స్‌ తింటుంటాం. బాదాం, పిస్తా, వాల్‌నట్స్‌... లాంటి వాటిని మన రోజువారీ డైట్‌లో చేర్చుకుంటాం. అయితే జీడిపప్పుపై మాత్రం చాలా మందికి అంత సదభిప్రాయం లేదనే చెప్పాలి. ఇది తినడం వల్ల అనవసరంగా కొవ్వు పెరుగుతుందని, బరువు పెరుగుతామని అనుకుంటాం. జీడిపప్పు మిగిలిన నట్స్‌తో పోలిస్తే రుచిగా ఉంటుంది. అందుకని రోజు మూడు నాలుగు కంటే ఎక్కువగా తినాలనిపిస్తాయి. అయితే మిగిలిన నట్స్ తో పాటుగా వీటినీ రోజూ రెండు, మూడు తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని మళ్లీ నేతిలో వేపించి, ఉప్పుకారం చల్లుకుని ఎక్కువ మోతాదులో తినొద్దంటున్నారు. రోజు నాలుగు కాజూ తినడం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

yearly horoscope entry point

జీడిపప్పు తినడం వల్ల లాభాలు:

  • జీడిపప్పులో లినోలెయిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శక్తివంతంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
  • దీనిలో ఎక్కువగా ప్రొటీన్‌, కొవ్వులు, మెగ్నీషియంలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వుల నిల్వలు పెరుగుతాయి. చెడు కొలస్ట్రాల్‌ నిల్వలు కరుగుతాయి. దీనిలో ఉండే అన్‌ శాచురేటెడ్‌, మోనో అన్‌ శాచురేటెడ్‌ కొవ్వుల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
  • జీడిపప్పు తినడం వల్ల ఎక్కువ కేలరీలే శరీరానికి అందుతాయి. కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, జీడిపప్పులు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండేవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, డైటరీ ఫైబర్లు. ఇవన్నీ ఆకలిని ఎక్కువగా వేయనియ్యవు. అందువల్ల తక్కువగా తింటాం. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
  • జీడిపప్పులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వీటితోపాటు విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఎముకల ఆరోగ్యం, నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. సాధారణంగా పాల ఉత్పత్తులు మాత్రమే ఎముకలను బలంగా చేస్తాయని మనం పొరపాటు పడుతుంటాం. కానీ దీనిలో ఉండే ఈ పోషకాలు కాల్షియం తయారీలో ఉపయోగపడతాయి. ఫలితంగా ఎముకలు దృఢంగా మారతాయి. ఎముకలు పెళుసుబారడం, బోలుగా అవ్వడం లాంటి అనారోగ్యాలతో బాధపడేవారికీ జీడిపప్పును క్రమంగా మితంగా తినడం వల్ల ఉపయోగంగా ఉంటుంది.
  • సాధారణంగా కొన్ని పదార్థాల్ని తినడం వల్ల పోషకాలు నేరుగా శరీరానికి అందుతాయి. అయితే జీడిపప్పులో ఉండే ఖనిజాల వల్ల మరో ఉపయోగమూ ఉంది. మనం తినే ఆహారంలో ఉండే విటమిన్లను శరీరం శోషించుకోవడంలో ఇది సహకరిస్తుంది. కొవ్వులో కరిగే విటమిన్లైన ఏ, డీ, ఈ, కేలను దీనిలో ఉండే కొవ్వులు గ్రహిస్తాయి. ఫలితంగా మన శరీరం ఎక్కువ పోషకాలను పట్టి ఉంచగలదు. అందుకనే ఇది మెదడు ఆరోగ్యంగా ఉండటంలోనూ సహకరిస్తుంది.

Whats_app_banner