International Yoga Day 2023। యోగాలో మొత్తం ఎన్ని ఆసనాలో.. ఆదియోగి ఆయనేనా?
International Yoga Day 2023: యోగాలో మొత్తం ఎన్ని ఆసనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పరమశివుడిని ఆదియోగిగా అనేక నివేదికలు పేర్కొన్నాయి. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం చదవండి.
International Yoga Day 2023: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన మహాద్భుతమైన వరం యోగా. ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో అయితే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతారో అదే సంపన్న దేశం అని చెప్పవచ్చు. యోగా సాధన చేయడం ద్వారా గొప్ప ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. ఏ వ్యక్తికైనా శారీరక, మానసిక, సామాజిక, అధ్యాత్మిక మొదలైన ప్రయోజనాలను కల్పించే వ్యాయామాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి యోగాభ్యాసాలే అని చెప్పాలి.
యోగాలో మొత్తం ఎన్ని ఆసనాలు ఉన్నాయి? ఆదియోగి ఎవరు?
యోగా అనేది వేల సంవత్సరాల నాటి పురాతన శాస్త్రం. హిందూ దేవుడైన శివుడిని ఆదినాథ్, మహా యోగి, యోగేశ్వర్, ఆదియోగి వంటి అనేకమైన అనేక పేర్లతో పిలుస్తారు. అనేక సిద్ధాంతాలు, పురాణేతిహాసాల ప్రకారం.. పరమశివుడే యోగా పితామహుడు అని పేర్కొన్నాయి. శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే సాధనంగా శివుడు యోగాని సృష్టించాడని చాలా నివేదికలు పేర్కొన్నాయి. అనేక హిందూ గ్రంథాలు, సిద్ధాంతాలు శివుడిని ఆదియోగి (ప్రపంచంలోని మొదటి యోగి) గా పేర్కొంటాయి. వాటి ఆధారంగా శివుడు నటరాజ రూపంలో మారి తన కదలికల ద్వారా మొత్తం 84 లక్షల ఆసనాలను ఉద్భవింపజేశాడు. నటరాజు నృత్యభంగిమలు, హావభావాలు కూడా యోగా భంగిమలను ప్రతిబింబిస్తాయి.
ఈ యోగాసనాలను అన్నింటినీ సప్త ఋషులు నేర్చుకొని, వారి ద్వారా అందరికీ వ్యాప్తి చేయడం జరిగిందని కథనాలు ఉన్నాయి. అయితే సప్త ఋషులకు ఇలా యోగాను నేర్పించిది హిమాలయాలలో ఒక సాధువు, నటరాజు అవతారంలో అన్నీ నేర్పించాడు కాబట్టి శివ స్వరూపాన్నే ఆదియోగిగా పేర్కొంటారు.
యోగాలో మొత్తంగా 84 లక్షల యోగాసనాలు ఉన్నాయని పేర్కొనగా, వీటిని ప్రధానంగా నాలుగు భాగాలుగా వర్గీకరించారు. అవి
1. హఠ యోగా
వివిధ శారీరక భంగిమలు హఠయోగంలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం యోగాలోని ఆధునిక అభ్యాసాలు హఠ యోగాలోని బోధనలు, సూత్రాలను అనుసరిస్తాయి. హఠ యోగా బోధనలు ధ్యానం, ఆహార నియమాలు, శ్వాస పద్ధతులు, శారీరక వ్యాయామం, భంగిమ అమరికల మొదలనైన సమాచారాన్ని అందిస్తాయి.
2. మంత్ర యోగా
మంత్రం అనే పదం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రజలు సాధారణంగా పునరావృతం చేసే లేదా పఠించే మంత్రాన్ని సూచిస్తుంది. యోగా సహాయంతో మనసు ప్రక్షాళన చేసుకునే భావనను బోధించడానికి మంత్ర యోగా ఉపయోగపడుతుంది. విశ్వంలోని ఆదిమ శబ్దాలలో ఒకటైన ఓం అనే అక్షరం కూడా మంత్ర యోగాలో భాగమే.
3. రాజ యోగా
రాజా అనేది రాజుకు సంస్కృత పదం. రాజు ఎల్లప్పుడూ ఉత్తమమైన స్థానంలో, అందరి కంటే అగ్రస్థానంలో ఉంటాడు; అదేవిధంగా, రాజయోగా సాధన ఉత్తమమైన, అత్యున్నత లక్ష్యం ప్రయోజనాలను అందిస్తాయి. రాజయోగం అనేది జీవితంలో ఆనందం, సామరస్యాన్ని సాధించడానికి చేయవలసిన పద్ధతులు, అభ్యాసాల గురించి వివరిస్తుంది. రాజ యోగా సాధన అనేది వ్యక్తిలో నిగూఢమై ఉన్న శక్తులను అత్యల్ప స్థానం నుండి గరిష్ట సామర్థ్యానికి తీసుకెళ్లే ప్రయాణం ఇది మన శరీరంలో అత్యంత శక్తివంతమైన రూపాన్ని తీసుకుంటుంది.
4. లయ యోగా
మానవ జీవితంలో అంతిమ లక్ష్యాన్ని సాధించే సాధనంగా లయ యోగ ఉంటుంది. ఈ లయ యోగతో ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. జ్ఞానోదయం పొందడానికి లయ యోగాలో ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు, ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయి, ఇవి ఒకరి జీవితాన్ని మెరుగైన ఆధ్యాత్మిక సమతలంలోకి తీసుకురావడానికి సహాయపడతాయి. లయ యోగా మానవ శరీరంలో స్థిరమైన శక్తి పాయింట్లను సక్రియం చేయడానికి, వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. లయ యోగా పద్ధతి మన శరీరంలోని నిద్రాణమైన శక్తులను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతీ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తారు. యోగా సాధన చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించడానికి ఈ రోజు ప్రాముఖ్యత కలిగింది. భారతదేశంలో ఉద్భవించిన పురాతన అభ్యాసమైన యోగాను అందరికీ చేరేలా ఐక్యరాజ్యసమితి 2014లో యోగా డేను అధికారికంగా అధికారికంగా గుర్తించింది. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనేది ఈ ఏడాది థీమ్.
సంబంధిత కథనం