Lord Shiva Temples in South | వారణాసి ఒక్కటే కాదు ఈ దక్షిణ కాశీలను సందర్శించండి!-maha shivaratri famous lord shiva temples in southern india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lord Shiva Temples In South | వారణాసి ఒక్కటే కాదు ఈ దక్షిణ కాశీలను సందర్శించండి!

Lord Shiva Temples in South | వారణాసి ఒక్కటే కాదు ఈ దక్షిణ కాశీలను సందర్శించండి!

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 08:20 PM IST

Lord Shiva Temples in South India: ఉత్తరాన వారణాసిలోని కాశీ విశ్వనాథుని క్షేత్రం ఎంతో పవిత్రమైనది. దక్షిణ భారతదేశంలోనూ కొన్ని శివాలయాలు దక్షిణ కాశీలుగా గుర్తింపు పొందాయి. దక్షిణాన ప్రసిద్ధమైన కొన్ని శివాలయాలు ఇక్కడ తెలుసుకోండి.

Lord Shiva Temples in South India
Lord Shiva Temples in South India (Unsplash)

హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 18న, శనివారం రోజున దేశవ్యాప్తంగా మహా శివరాత్రి పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజున పార్వతీపరమేశ్వరులను పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు వెళ్లి పరమశివుడిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు, రాత్రంతా జాగరణ చేస్తారు, శివుని ధ్యానంలో లీనమై ఉంటారు. శివ నామస్మరణతో శివాలయాలు మారుమోగే సందర్భం ఇది.

మహా శివరాత్రి రోజున కాశీ లేదా వారణాసిలో గొప్పగా వేడుకలు జరుగుతాయి. చాలా మంది భక్తులు వారణాసి వెళ్లి శివపూజలో పాల్గొని ధన్యులవుతారు. దేశంలో వారణాసి కాకుండా మరెన్నో అద్భుతమైన శైవక్షేత్రాలు ఉన్నాయి.

Lord Shiva Temples in South India- దక్షిణ భారతదేశంలో ప్రముఖ శివాలయాలు

మీరు కూడా ఈ మహా శివరాత్రి రోజున ఏదైనా ప్రముఖ శివాలయాన్ని సందర్శించాలని కోరుకుంటే, దక్షిణ భారతదేశంలో నెలవై ఉన్న కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయం 12 జ్యోతిర్లింగాలకు ప్రసిద్ధి. ఈ ఆలయం శ్రీశైలం పట్టణంలో కృష్ణా నదీ తీరానికి సమీపాన, నల్లమల కొండలపై నెలకొని ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది సతీదేవి 18 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ శివుడు మల్లికార్జున స్వామి అవతారంలో కొలువై ఉన్నాడు. మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే వేడుకలు మహాద్భుతంగా ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సమీపాన కాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వరాలయం కూడా ఎంతో ప్రసిద్ధమైనది. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో శ్రీ రాజ రాజేశ్వర దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది. ఇది 8వ - 10వ శతాబ్దాల మధ్య నిర్మించినట్లుగా చెప్పే అతి పురాతనమైన శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం దాని నిర్మాణ వైభవం, ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ధర్మ గుండంలోని పవిత్ర జలాల్లో పవిత్ర స్నానం చేస్తే, పరమేశ్వరునికి శరణాగతి పొందవచ్చు.

మరొకటి, వరంగల్ సమీపంలోని రామప్ప దేవాలయం కూడా ఎంతో ప్రముఖమైనది. ఇది కాకతీయుల కాలం నాటిది, దీని వాస్తుకళకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది.

రామనాథ స్వామి దేవాలయం, తమిళనాడు

దక్షిణ భారతదేశంలోని అత్యంత అందమైన శివాలయాలలో ఒకటి రామేశ్వరం ద్వీపంలో ఉంది, అదే అరుల్మిగు రామనాథ స్వామి ఆలయం. ఈ దేవాలయం దేశంలోని శివాలయాలలో ముఖ్యమైనది. భారతదేశంలోని చార్ ధామ్ యాత్రలో భాగంగా ఉండే యాత్రా స్థలాలలో కూడా ఒకటిగా కూడా పరిగణించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోని 12 జ్యోతిర్లింగ దేవాలయాలలో ఇది కూడా ఒకటి. మహా శివరాత్రి సమయంలో ఈ ఆలయ సందర్శన ఒక గొప్ప అనుభూతి.

మీనాక్షి సుందరేశ్వర ఆలయం, తమిళనాడు

మదురై దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందింది. మదురైలోని అత్యంత అద్భుతమైన దేవాలయాలలో ఒకటి అరుల్మిగు మీనాక్షి అమ్మన్ ఆలయం. మధుర మీనాక్షి ఆలయం లేదా మీనాక్షి సుందరేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో మీనాక్షి దేవీ కొలువై ఉంది. ఈమెను పార్వతీ దేవి దివ్య అవతారంగా చెబుతారు. అలాగే శివుడుని సుందరేశ్వరుని రూపంలో పూజిస్తారు. శివపార్వతులు ఇద్దరూ కొలువై ఉన్న ఈ క్షేత్రం చారిత్రక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది.

మహా బలేశ్వర ఆలయం, కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ క్షేత్రం చాలా పురాతనమైన శైవక్షేత్రం. ఈ దేవాలయం రామాయణ, మహా భారతం వంటి హిందూ పురాణాలలోనూ ప్రస్తావించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో 6 అడుగుల ఎత్తైన శివలింగం ఉంది. దీనిని ఆత్మలింగంగా పిలుస్తారు. రావణుడు- ఆత్మలింగం కథ కూడా ఈ క్షేత్రంతో ముడిపడి ఉంది. ఈ క్షేత్రాన్ని కూడా దక్షిణ కాశీగా పిలుస్తారు.

మరొకటి, గోకర్ణ క్షేత్రానికి సుమారు 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుడేశ్వర ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి చుట్టూ మూడు వైపులా అరేబియా సముద్రం, శివుని విగ్రహంతో కూడిన గోపురం అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలోని రెండవ ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది.

Whats_app_banner

సంబంధిత కథనం