Music For Yoga | యోగా, ఇతర వ్యాయామాలు చేసేటపుడు ఇలాంటి సంగీతం వినాలి!
World Music Day 2023: సంగీతం వ్యాయామం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. సంగీతంలోని ఒక్కో శైలి (Music Genre) మీకు ఒక్కో విధమైన ప్రయోజనం చేకూరుస్తుంది. యోగా కోసం ఎలాంటి సంగీతం అవసరమో తెలుసుకోండి
World Music Day 2023: బాధైనా, సంతోషమైనా, ఉత్సాహమైనా, నిరాశలో అయినా ఎల్లవేళలా మీకు తోడుండేది, మీకు ఓదార్పు నిచ్చేది, మీ మూడ్ మార్చేది ఏదైనా ఉందా అంటే అది సంగీతమే. ఇది ఒక కళారూపమే అయినప్పటికీ, సంగీతం అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా స్నేహితులతో ఆనందిస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు సంగీతం మన జీవితంలోని ప్రతి భాగానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను రూపొందిస్తుంది.
కళకు భాషాభేదాలు ఉండవు, ఏ ప్రాంతం వారినైనా అద్భుతమైన కళ అందరినీ రంజింపజేస్తుంది. ఈ కళలన్నింటిలోకెల్లా సంగీతం మరింత శక్తివంతంగా జనాలలోకి చొచ్చుకెళుతుంది. అంతేనా, సంగీతం వింటే అనేక మానసిక, శారీరక ప్రయోజనాలు ఉన్నాయి. పలు రకాల మానసిక రుగ్మతలకు మ్యూజిక్ థెరపీని ఒక చికిత్సగా కూడా ఉపయోగిస్తారు.
మరోవైపు సంగీతం వ్యాయామం చేయడానికి కూడా ప్రేరణనిస్తుంది. మీరు మరింత ఉత్సాహంతో శ్రమించడానికి, మీరు ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఆడుతూ పాడుతూ ఏ పని చేసినా అలుపు అనేదే ఉండదు అని మీకు తెలిసిందే కదా.
ఈ సంగీతంలోనూ అనేక రకాలు ఉంటాయి. సంగీతంలోని ఒక్కో శైలి (Music Genre) మీకు ఒక్కో విధమైన ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు డ్యాన్స్ చేసేందుకు ఊపొచ్చే బీట్స్ కావాలి, వ్యాయామాలు చేసెందుకు జోష్ మ్యూజిక్ ఉండాలి, యోగా, ధ్యానం లాంటి వాటికి మరొ రకమైన సంగీతం అవసరం. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం, ఈ సందర్భంగా మీరు వ్యాయామాలు చేయటానికి మీకు ఎలాంటి మ్యూజిక్ అవసరమో ఇక్కడ ఒక లుక్ వేయండి.
నడక లేదా రన్నింగ్ కోసం రాక్ మ్యూజిక్
మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు లేదా శ్రమిస్తున్నప్పుడు, వాకింగ్, రన్నింగ్ లాంటివి చేస్తున్నప్పుడు మీ అడుగులకు అనుగుణంగా స్థిరమైన బీట్లు కలిగిన రాక్ మ్యూజిక్ ఎంచుకోండి.
తీవ్రమైన వ్యాయామానికి మెటల్ బీట్స్
తీవ్రమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం మీకు ఉంది. కానీ మీ శరీరం అప్పటికే అలసిపోతే, మీ ఊపిరితిత్తులు విరామం కోసం ఆయాస పడితే వ్యాయామాన్ని ఆపేస్తారు. అలా కాకుండా చిన్న విరామం తీసుకొని హెవీ మెటల్ మ్యూజిక్ వింటే మరింత అదనంగా వ్యాయామం చేయగలరు. మరిన్ని అదనపు క్యాలరీలను ఖర్చు చేయగలరు.
జుంబా ఏరోబిక్స్ కోసం మిశ్రమ సంగీతం
మీరు జుంబా రొటీన్‌లలో పాల్గొనేవారికి మీ ఫిట్‌నెస్, ఇంకా వినోదం అన్ని మిక్స్ చేసిన మిశ్రమ సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అనేక డ్యాన్సింగ్ మ్యూజిక్ ట్రాక్‌లు మీ జుంబా ఫిట్‌నెస్ సెషన్ సజావుగా సాగడానికి సరిపోతాయి, ఎక్కువగా రెగ్గేటన్, పాప్, లాటిన్ పాప్ వంటి మ్యూజిక్ జోనర్లను ఎంచుకుంటారు.
యోగా కోసం శాస్త్రీయ సంగీతం
శాస్త్రీయ సంగీతం మెదడును సానుకూలంగా ఉత్తేజపరిచేందుకు, ప్రశాంత ప్రభావాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఎవారైనా యోగాను అభ్యసించడానికి ఒక పెద్ద కారణం మానసికంగా ఆరోగ్యంగా ఉండటం కోసం, ఒత్తిడిని తగ్గించడం కోసం. యోగా, ధ్యానం వంటి అభ్యాసాలు ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి కాబట్టి, ఈ రకమైన అభ్యాసాలకు శాస్త్రీయ సంగీతం మెరుగైన ఫలితాలను అందిస్తుంది. పక్షుల కిలకిల రావాలు, సహజమైన శబ్దాలు, ప్రశాంతమైన మ్యూజిక్ అవసరం.
సంబంధిత కథనం