Drumstick Flower Benefits : ఈ ప్రయోజనాలు తెలిస్తే మునగ పువ్వును అస్సలు వదలరు-immunity boost to eye health benefits of drumstick flowers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drumstick Flower Benefits : ఈ ప్రయోజనాలు తెలిస్తే మునగ పువ్వును అస్సలు వదలరు

Drumstick Flower Benefits : ఈ ప్రయోజనాలు తెలిస్తే మునగ పువ్వును అస్సలు వదలరు

Anand Sai HT Telugu
Feb 19, 2024 03:30 PM IST

Drumstick Flower : మునగ చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు వేర్ల నుంచి చివర్ల వరకూ ప్రతీదీ ఉపయోగపడుతుంది. మునగ పువ్వుతోనూ మంచి ప్రయోజనాలు దొరుకుతాయి.

మునగ పువ్వు ప్రయోజనాలు
మునగ పువ్వు ప్రయోజనాలు (Unsplash)

మునగ చెట్టును చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మునక్కాయలు వంటల్లో వాడుతుంటారు. అంతేకాదు ఈ చెట్టు ఆకులను తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు దొరుకుతాయి. ఈ చెట్ల పువ్వుల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. మునగ పువ్వులతో కలిగే అద్భుతమైన ఉపయోగాలు తెలుసుకుందాం..

మునగ పువ్వు అమృతం లాంటిది

చెట్లపై గుత్తులుగా వికసించే మునగ పువ్వు చూసేందుకు అందంగా ఉంటుంది. ఇది శరీర నొప్పికి ఉపయోగకరం. విటమిన్ ఎ, రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కొందరికి పని ఎక్కువ కావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. శారీరకంగా అలసిపోయి మానసికంగా అలసిపోతారు. వీటన్నింటికి ఉపశమనం కలిగించే అమృతం మునగ పువ్వు.

మునగ పూలను కోసి వాటిని బాగా జల్లెడ పట్టి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఈ పొడిని తీసుకుని నీటిలో కలిపి మరిగించాలి. బాగా మరిగించి తాగితే నిద్రలేమి, నరాలవ్యాధులు అన్నీ పోయి శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

మునగ పువ్వు టీ

మునగ పువ్వు టీ కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. శరీరం బలహీనమైన స్థితి కారణంగా పీరియడ్స్ సమయంలో స్త్రీలలో కడుపు నొప్పి, తలనొప్పి వంటివి వస్తాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు మునగ పువ్వు టీ తాగొచ్చు.

కంటి సమస్యలకు ఔషధం

ఈ పువ్వు కంటికి సంబంధించిన అన్ని రుగ్మతలను నయం చేస్తుంది. మధ్య వయస్కులకు కంటి చూపు సమస్యలు ఉంటాయి. పైన చెప్పిన పూల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే.. దృష్టి దోషాలు నయమవుతాయి. ఎక్కువసేపు కంప్యూటర్, టెలివిజన్ ముందు కూర్చోవడం కళ్ల సాధారణ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. మునగ పువ్వులను పాలలో కలిపి బాగా మరిగించి తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. మునగ పూల పాలను పిల్లల నుంచి పెద్దల వరకు సేవిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు మునగ పూలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది.

స్త్రీపురుషులకు ఎంతో ఉపయోగం

తల్లుల పాల స్రావాన్ని మెరుగుపరిచేందుకు, మగ కణాల బూస్టర్‌గా ఉండేందుకు మునగ పూలను వాడుకోవచ్చు. మునగ పువ్వుల్లో ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొన్ని ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించి తింటే స్త్రీల శరీరం దృఢంగా మారి తల్లిపాలు పెరుగుతాయి. పురుషుల శరీరాన్ని పునరుజ్జీవింపజేసి కణాల నాణ్యతను పెంచుతుంది. సాధారణంగా ఇది అధిక రక్తపోటు చికిత్సలో కూడా శక్తివంతమైనది.

రోగనిరోధక శక్తి పెంచేందుకు

మునగ పువ్వులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాని ఎండిన పొడి, పువ్వును తీసుకుని పాలలో కలిపితే చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పువ్వు శరీరంలోని హానికరమైన క్రిములను బయటకు పంపడంలో శక్తివంతమైనది. మునగ పువ్వులను తీసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని చూసుకోవాలి. మునగ పువ్వుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ వైద్యుడి సలహాల మేరకు తీసుకోవాలి. అతిగా తీసుకోకూడదు. మితంగానే వాడుకోవాలి.