Aloo Dum Biryani: హైదరాబాదీ ఆలూ దమ్ బిర్యానీ... శాకాహారులకు ఇది నచ్చడం ఖాయం
Aloo Dum Biryani: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా బిర్యాని తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఒకసారి హైదరాబాదీ స్టైల్ లో ఆలూ దమ్ బిర్యాని ప్రయత్నించండి.
Aloo Dum Biryani: హైదరాబాద్ ఆలూ దమ్ బిర్యాని పేరు చెబితేనే నోరూరిపోతుంది. చికెన్ బిర్యానిలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మాంసాహారం తినని శాఖాహారులకు ఈ బిర్యాని తింటే కచ్చితంగా నచ్చుతుంది. మాంసాహారులు కూడా ఈ ఆలూ దమ్ బిర్యానిని ఇష్టంగా తింటారు. దీన్ని చేయడం చాలా సులువు. హైదరాబాద్ స్టైల్ లో ఆలూ దమ్ బిర్యాని రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి.
హైదరాబాదీ ఆలూ దమ్ బిర్యాని రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన బంగాళదుంపలు - మూడు
ఉల్లిపాయ - ఒకటి
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
పుదీనా తరుగు - నాలుగు స్పూన్లు
నెయ్యి - రెండు స్పూన్లు
నూనె - ఒక స్పూను
పెరుగు - ఒక కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
లవంగాలు - రెండు
షాజీరా - పావు స్పూను
అనాసపువ్వు - ఒకటి
యాలకులు - రెండు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
మరాఠీ మొగ్గ - ఒకటి
బిర్యానీ ఆకులు - రెండు
నీళ్లు - సరిపడినన్నీ
హైదరాబాదీ ఆలూ దమ్ బిర్యాని రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి.
2. వాటిని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా చేసుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. బంగాళాదుంప ముక్కలను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఒక గిన్నెలో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
5. ఆ మిశ్రమంలోనే ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి వాటికి పట్టేలా చూడాలి.
6. కప్పు పెరుగును కూడా వేసి అరగంట పాటు పక్కన వదిలేయాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద బాస్మతి బియ్యాన్ని పెట్టి అది ఉడకడానికి సరిపడా నీళ్ళని వేయాలి.
8. అందులోనే బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు, పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి ఉడికించాలి.
9. అన్నం 60 శాతం ఉడికే దాకా ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
10. ఆ నీటిని వడకట్టి ఒక ప్లేట్లో ఉడికిన బాస్మతి బియ్యాన్ని పొడి పొడిగా వచ్చేలా ఆరబెట్టాలి.
11. ఇప్పుడు మరొక పాత్రను స్టవ్ మీద పెట్టాలి.
12. అందులో ఒక స్పూను నెయ్యి ,ఒక స్పూన్ నూనె వేయాలి.
13. నిలువుగా తరిగిన ఉల్లిపాయలను అందులో వేసి వేయించాలి అవి రంగు మారేవరకు వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
14. మిగిలిన నూనెలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్క మిశ్రమాన్ని వేయాలి.
15. వాటిని బాగా ఉడికించాలి. కాస్త నీళ్లు పోసి చిక్కగా గ్రేవీలా వచ్చేవరకు ఉడికించుకోవాలి.
16. ఇప్పుడు 60 శాతం ఉడికిన బాస్మతి బియ్యాన్ని ఈ బంగాళదుంపలపై పొరలు పొరలుగా వేసుకోవాలి.
17. పైన ఒక స్పూను నెయ్యిని చల్లుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల ను కూడా చల్లుకోవాలి.
18. కొత్తిమీర తరుగును చల్లుకొని పైన మూత పెట్టాలి.
19. ఆవిరి బయటకు పోకుండా మూతపై బరువును ఉంచండి.
20. చిన్న మంట మీద పావుగంట పాటు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
21. టేస్టీ ఆలూ దమ్ బిర్యాని ఘుమఘుమలాడిపోతూ రెడీగా ఉంటుంది. దీన్ని వండుతున్నప్పుడే తినేయాలన్న కోరిక పుడుతుంది. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఈ హైదరాబాదీ ఆలూ దమ్ బిర్యాని చేసుకుంటే తినాలన్న కోరిక పుడుతుంది. ముఖ్యంగా శాఖాహారులకు ఇది మంచి రుచిని ఇస్తుంది. మాంసాహారులకు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వాటితో సమానమైన రుచిని బంగాళదుంప బిర్యాని ఇవ్వగలదు. దీంతో పాటు రైతాను పక్కన పెట్టుకొని తింటే ఆ రుచే వేరు.