Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం-munagaku kothimeera pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Munagaku Kothimeera Pachadi: మునగాకు కొత్తిమీర పచ్చడి ఇలా చేశారంటే రెట్టింపు ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
May 17, 2024 11:34 AM IST

Munagaku Kothimeera Pachadi: మునగాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ దీన్ని ఆహారంలో భాగం చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది. మునగాకు కొత్తిమీర పచ్చడి చేసి చూడండి. మీకు నచ్చుతుంది.

మునగాకు కొత్తిమీర పచ్చడి
మునగాకు కొత్తిమీర పచ్చడి (Youtube)

Munagaku Kothimeera Pachadi: మునగాకు రెసిపీలను తినమని వైద్యులు సూచిస్తున్నా కూడా ఎంతోమంది వాటిని పట్టించుకోవడం లేదు. ఇక్కడ మేము మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ ఇచ్చాము. ఇది వేడి వేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని దోశ, ఇడ్లీల్లో కూడా తినవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ముఖ్యంగా మునగాకు, కొత్తిమీర ఈ రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడి తింటే రెట్టింపు ఆరోగ్యం దక్కుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.

మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

కొత్తిమీర తరుగు - ఒక కప్పు

మునగాకు - ఒక కప్పు

పచ్చిమిర్చి - మూడు

వెల్లుల్లి - ఐదు రెబ్బలు

జీలకర్ర - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - అర స్పూను

నువ్వులు - రెండు స్పూన్లు

నూనె - సరిపడినంత

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఎండుమిర్చి - ఐదు

శనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

కరివేపాకు - గుప్పెడు

మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ

1. మునగాకును, కొత్తిమీరను శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. నూనె వేడెక్కాక మునగాకులను వేసి వేయించాలి. అవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు అదే కళాయిలో శనగపప్పు వేసి వేయించాలి.

5. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసి వేయించాలి.

6. చివరిలో నువ్వులను వేయాలి. వీటన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి.

7. అదే కళాయిలో కొత్తిమీర తరుగును కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

8. ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన అన్నింటిని వేసి, చింత పండును వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

9. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

10. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

11. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేయించి ఈ పచ్చడి మీద వేసుకోవాలి.

12. ఇలా తాళింపు పెట్టుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది.

13. ఈ పచ్చడి చేయడం ఎంత సులువో చూశారా వారానికి కనీసం ఒక్కసారైనా ఈ పచ్చడిని చేసుకొని చూడండి... చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

మునగాకును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల భయంకర రోగాలైన క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటివి రాకుండా ఉంటాయి. మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ చేరకుండా అడ్డుకుంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా మునగాకులో ఉంటాయి. కాబట్టి మునగాకును వారానికి కనీసం రెండుసార్లు తినడం వల్ల రెట్టింపు పోషకాలను అందుకోవచ్చు. ఇక కొత్తిమీరతో కలిపి తింటే ఆ రెండింటిలోని పోషకాలు కలిసి శరీరానికి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తాయి.

Whats_app_banner