Pain Balm DIY: తల, ఒళ్లు నొప్పులు తగ్గించే పెయిన్ బామ్ ఇంట్లోనే తయారు చేసుకోండి
Pain Balm DIY: తలనొప్పి, ఒళ్లు నొప్పులకు తరచూ పెయిన్ బామ్ వాడుతుంటారు. కానీ దాన్ని దీర్ఘాకాలికంగా వాడటం మంచిదేం కాదు. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ పెయిన్ బామ్ తయారీ ఎలాగో తెల్సుకోండి.
రాత్రి నిద్రపోయే ముందు తలకు పెయిన్ బామ్ రాసుకోకపోతే చాలా మందికి నిద్రపట్టదు. తలగడ కిందో, మంచం వెనకాలో తప్పకుండా పెయిన్ బామ్ ఉంటుంది చాలా ఇళ్లలో. కొందరికి వాటిని రాసుకుంటే కానీ నిద్ర పట్టదు. అయితే వీటిలో ఎంతో కొంత రసాయనాల శాతం లేకపోదు. ఇంట్లోనే కాస్త ఓపిక తెచ్చుకుని నొప్పిని తగ్గించే పెయిన్ బామ్ తయారు చేసుకోవచ్చు.
దీనికి కావాల్సిన పదార్థాలు మీ దగ్గర ఉండకపోవచ్చు. ఒక్కసారి ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నారంటే మాత్రం చాలా రోజులు వాడుకోవచ్చు. ఈ బామ్ కోసం వాడే నూనెల్ని చర్మం, జుట్టు సంబంధిత అనేక సమస్యలకు ఉపశమనంగా వాడుకోవచ్చు కూడా.
పెయిన్ బామ్ తయారీ:
1. పెయిన్ బామ్ తయారీ కోసం 2 చెంచాల కొబ్బరి నూనె, 2 చెంచాల బీస్ వ్యాక్స్, 2 చుక్కల నీలగిరి నూనె, 2 చుక్కల పెప్పర్ మింట్ నూనె, 2 చుక్కల ల్యావెండర్ నూనె, 2 చుక్కలు రోజ్ మేరీ నూనె అవసరం అవుతాయి.
2. తయారీ కోసం ముందుగా బీస్ వ్యాక్స్ గిన్నెలో వేసుకుని ఆ గిన్నె వేడినీళ్లలో పెట్టి కరిగించుకోవాలి. కొబ్బరి నూనె కూడా అలాగే కరిగించుకోవాలి.
3. ఇప్పుడు ఒక గిన్నెలోకీ ఈ రెండూ తీసుకుని అందులో ఎసెన్షియల్ నూనెలన్నీ వేసుకోవాలి. బాగా కలిపి ఒక గాజు సీసాలో పోసుకోవాలి.
4. మూత పెట్టి చల్లారనివ్వాలి.
5. కాసేపు ఫ్రిజ్ లో పెడితే గడ్డకట్టి పెయిన్ బామ్ రెడీ అయిపోతుంది.
పెయిన్ బామ్ ఎలా వాడాలి?
తయారు చేసుకున్న బామ్ చల్లారాక నేరుగా మీకు నొప్పి ఉన్న ప్రాంతంలో రాసుకోవచ్చు. ఒక నిమిషం పాటూ సున్నితంగా నొప్పి ఉన్న చోట మర్దనా చేయాలి. దాంతో చర్మం లోపలిదాకా ఇంకుతుంది. దీన్ని వాడే ముందు కాస్త చేతి దగ్గర ప్యాచ్ టెస్ట్ చేసుకుని చూడండి.
లాభాలు:
ఈ బామ్ తయారీలో వాడే కొబ్బరి నూనెకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి. సాధారణంగా కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనెలో కాస్త ఎప్సం లవణం వేసి నొప్పి ఉన్న చోట మర్దనా చేసినా ఫలితం ఉంటుంది. కీళ్ల దగ్గర మర్దనా చేస్తే నొప్పి తగ్గుతుంది.
ఈ బామ్ తయారీలో వాడే ఎసెన్షియల్ నూనెల్లో కూడా అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. ల్యావెండర్ నూనెకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి. కీళ్లు, నడుము, కాళ్ల నొప్పులకు ఇది బాగా పనిచేస్తుంది. నీలగిరి నూనెకూడా నొప్పి తగ్గిస్తుంది. రక్త సరఫరా పెంచుతుంది. పెప్పర్ మింట్ నూనె నొప్పి ఉన్న చోట సత్వర ఉపశమనం ఇస్తుంది. కాబట్టి వీటన్నింటినీ కలిపి బీస్ వ్యాక్స్ తో చేసిన బామ్ నొప్పి తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.
టాపిక్