Instant Dosa: ఇన్స్టంట్ గోధుమపిండి ఉల్లిదోశ, 5 నిమిషాల్లో చేసేయొచ్చు-how to make instant wheat flour onion dosa for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Dosa: ఇన్స్టంట్ గోధుమపిండి ఉల్లిదోశ, 5 నిమిషాల్లో చేసేయొచ్చు

Instant Dosa: ఇన్స్టంట్ గోధుమపిండి ఉల్లిదోశ, 5 నిమిషాల్లో చేసేయొచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Oct 05, 2024 06:30 AM IST

Instant Dosa: గోధుమపిండి ఉంటే చాలు వెంటనే ఇలా గోధుమపిండి ఉల్లిదోశ చేసేయొచ్చు. పిండి పులియబెట్టాల్సిన పనిలేదు. అలాగని రుచిలోనూ తీసిపోని ఈ టేస్టీ రెసిపీ చూడండి.

గోధుమపిండి ఉల్లిదోశ
గోధుమపిండి ఉల్లిదోశ

దోశలు తినాలనిపిస్తే ముందు రోజు నుంచి అన్నీ సిద్ధం చేసుకోవాల్సిందే. కానీ ఉన్నట్లుండి చేసుకునే ఇన్స్టంట్ దోశెలు బోలెడు రకాలున్నాయి. వాటిలో ఒకటి గోధుమపిండి ఉల్లిదోశ. దోశల పిండిలో తాలింపు కలిపి, కూరగాయ ముక్కలతో వేసుకునే ఈ దోశ క్రిస్పీగా రుచిగా ఉంటుంది. తయారీ కూడా చాలా సులభం. ఇక్కడ ఉల్లి, టమాటా మాత్రమే వాడాం. మీకిష్టమైన ఇంకేమైనా కూరగాయ ముక్కలు కూడా వేసుకుని ఇలాగే దోశ చేసుకోవచ్చు.

గోధుమపిండి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు గోదుమపిండి

1 చెంచా బియ్యంపిండి

పావు కప్పు ఉల్లిపాయ తరుగు

తగినంత ఉప్పు

కొద్దిగా కొత్తిమీర తరుగు

1 చెంచా నూనె

1 టీస్పూన్ ఆవాలు

1 టీస్పూన్ జీలకర్ర

1 టీస్పూన్ శనగపప్పు

1 కరివేపాకు రెమ్మ

4 పచ్చిమిర్చి సన్నం ముక్కలు

పావు కప్పు తరిగిన టమాటా ముక్కలు

పావు టీస్పూన్ అల్లం తురుము

పావు చెంచా పసుపు

గోధుమపిండి దోశ తయారీ విధానం:

1. ముందుగా ఒక కడాయిలో నూనె వేసుకొని వేడి అవ్వనివ్వాలి. అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసుకుని వేగనివ్వాలి.

2. ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని రంగు మరేదాకా మగ్గనివ్వాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం తరుగు కూడా వేసి నిమిషం పాటూ వేయించాలి.

3. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి. ముక్కలు మెత్తబడ్డాక పసుపు వేసుకుని కలిపి స్టవ్ కట్టేయాలి. దోశ కోసం తాలింపు రెడీ అయినట్లే.

4. ఇప్పుడు పెద్ద గిన్నెలో గోధుమపిండి, బియ్యం పిండి, ఉప్పు వేసుకుని ఒకసారి పొడిగా కలిపి నీళ్లు పోసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. దోశ పిండిలాగా పలుచగా ఉండాలి.

5. ఈ పిండిలో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాళింపు, కొత్తిమీర తరుగు కూడా వేసుకుని బాగా కలియబెట్టాలి.

6. ఇప్పుడు దోశ పెనం పెట్టుకుని ముందుగా కొద్దిగా నూనె వేసి పెనం అంతటా రాసుకోవాలి. పెద్ద గరిటె నిండా పిండి తీసుకుని దోశెల కన్నా మందంగా పోసుకోవాలి.

7. అంచుల వెంబడి నూనె పోసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. అవసరం అనుకుంటూ మీద మూత పెట్టి నిమిషం ఉంచి తీయాలి. దీంతో దోశ బాగా ఉడుకుతుంది.

8. రెండు వైపులా రంగు మారేదాకా రెండు నిమిషాలు కాల్చుకుని తీసేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఇన్స్టంట్ గోదుమపిండి ఉల్లిదోశ రెడీ అయినట్లే.

9. దీన్ని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదా అలాగే కూడా తినేయొచ్చు.

Whats_app_banner