Homemade biscuits: గోధుమపిండితో టేస్టీ బిస్కట్లు చేసేయండి, పిల్లలకు హెల్తీ స్నాక్-how to make wheat flour biscuits at home without maida and oven ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Homemade Biscuits: గోధుమపిండితో టేస్టీ బిస్కట్లు చేసేయండి, పిల్లలకు హెల్తీ స్నాక్

Homemade biscuits: గోధుమపిండితో టేస్టీ బిస్కట్లు చేసేయండి, పిల్లలకు హెల్తీ స్నాక్

Koutik Pranaya Sree HT Telugu
Aug 27, 2024 03:30 PM IST

Homemade biscuits: మైదా వాడకుండా, ఓవెన్ లేకపోయినా కేవలం గోధుమపిండితో ఇంట్లోనే బిస్కట్లు చేయొచ్చు. చాలా సింపుల్ గా అయిపోతాయివి. వీటి తయారీ విధానం ,కావాల్సిన పదార్థాలు చూడండి.

గోధుమపిండి బిస్కట్లు
గోధుమపిండి బిస్కట్లు

ఎంత ప్రయత్నించినా పిల్లలు బయట దొరికే బిస్కట్లు తినకుండా ఆపలేం. ఇంట్లోనే బిస్కట్లు రుచిగా చేసి పెడితే మాత్రం అది సాధ్యమే. అలాగనీ వాటికోసం ఏవేవో పదార్థాలు అక్కర్లేదు. మీ వంటగదిలో ఉండే పదార్థాలతోనే ఈ గోధుమ పిండి బిస్కట్లు రెడీ అవుతాయి. అదెలాగో చూసేయండి.

గోధుమపిండి బిస్కట్ల తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు గోధుమపిండి

పావు టీస్పూన్ యాలకుల పొడి

1/8 టీస్పూన్ జాజికాయ పొడి

చిటికెడు ఉప్పు (ఉప్పు తీపి రుచి పెంచుతుంది)

4 చెంచాల నెయ్యి

పావు కప్పు పంచదార పొడి

పావు కప్పు పాలు

గోధుమపిండి బిస్కట్ల తయారీ విధానం:

  1. ముందుగా గోధుమపిండి బిస్కట్ల తయారీ కోసం ఒక పెద్ద బౌల్‌లో గోధుమపిండి జల్లించి వేసుకోవాలి. దీంతో పిండిలో ఉండలు ఉండవు.
  2. ఆ పిండిలోనే యాలకుల పొడి, జాజికాయ పొడి, ఉప్పు కూడా వేసుకుని పొడిగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు నెయ్యిని కరిగించుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులోనే పంచదార పొడిని జల్లించుకుని వేసుకోవాలి. రెండూ బాగా కరిగేదాకా గిలక్కొంటుకుంటూ కలుపుకోవాలి. చిక్కటి మిశ్రమం తయారవుతుంది.
  4. దీన్ని ముందుగా కలుపుకున్న పొడి పదార్థాల్లో వేసుకుని స్పాచ్యులాతో కలుపుకోవాలి.
  5. చేత్తో బాగా కలుపుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా పిండి ముద్ద కలుపుకోవాలి.
  6. ఇప్పుడు కిచెన్ స్లాబ్ మీద లేదా చపాతీ చెక్క మీద ఈ పిండిని వేసుకుని ఒక సెంటిమీటర్ మందం ఉండేలా ఒత్తుకోవాలి.
  7. చాకు సాయంతో ముక్కలు చేసుకోవాలి. బిస్కట్లు బాగా ఉడకడానికి మధ్యలో ఫోర్క్ తో గాట్లు పెట్టాలి
  8. ఇప్పుడు అడుగు ఎక్కువున్న కడాయి తీసుకుని అందులో అరకేజీ దాకా ఉప్పు పోసుకోవాలి. అది వేడెక్కాక ఒక స్టాండ్ పెట్టుకోవాలి.
  9. కట్ చేసుకున్న బిస్కట్లను ఒక ప్లేట్ మీద సర్దాలి. ఈ ప్లేట్ స్టాండ్ మీద పెట్టుకోవాలి.
  10. మూత పెట్టి కనీసం పావుగంట సేపు ఆగితే బిస్కట్లు రెడీ అవుతాయి. ఓవెన్ ఉంటే 180 డిగ్రీల వద్ద ప్రిహీట్ చేసి కనీసం పావుగంట సేపుంచితే బిస్కట్లు రెడీ అయిపోతాయి.
  11. చల్లారాక గాలి చొరవని డబ్బాలో వేసి పెట్టుకున్నారంటే నెలయినా పాడవ్వవు.

టాపిక్