Shakkar para: షక్కర్ పారా అంటే పంచదార బిస్కట్లు.. పిల్లలు మెచ్చే బెస్ట్ స్నాక్..
Shakkar para: ఇంట్లో చేసుకునే ఒకరకమైన పంచదార బిస్కట్లే షక్కర్ పారా. వీటిని పిల్లలు చాలా ఇష్టపడతారు. వాటిని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూసేయండి.
దూర ప్రాంతాలకు వెళ్తునప్పుడు ప్రయాణంలో ఏదైనా తియ్యగా తినడానికి చేయాలనుకుంటే ఒకసారి షక్కర్ పారా ప్రయత్నించండి. పంచదారతో చేసే తీపి బిస్కట్లు ఇవి. షక్కర్ అంటే పంచదార, పారా అంటే ముక్కలు. అంటే తియ్యగా ఉండే చిన్న చిన్న బిస్కట్లు అనుకోవచ్చు.
చాలా సులువుగా ఉంటుంది దీని తయారీ. పిల్లలకు కూడా ఏమైనా కావాలని అడిగినప్పుడు బయట చిరుతిండ్లకు బదులు వీటిని ఇచ్చి చూడండి. పక్కాగా నచ్చేస్తాయి. మీ రుచిని బట్టి పంచదార తక్కువా, ఎక్కువా వేసుకోవచ్చు. వివరంగా ఎలా చేయాలో చూసేయండి.
వీటి తయారీకి మైదా పిండిని సాధారణంగా వాడతారు. మీరు కాస్త ఆరోగ్యకరంగా చేయాలనుకుంటే మైదాకు బదులు గోధుమపిండి వాడుకోవచ్చు.
షక్కర్ పారా తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కప్పు పంచదార
కప్పు మైదా పిండి
ఒక చెంచా సన్నం రవ్వ
పావు చెంచా యాలకుల పొడి
2 చెంచాల నెయ్యి
చిటికెడు ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
షక్కర్ పారా తయారీ విధానం:
1. ముందుగా ఒక పెద్ద గిన్నెలో పంచదార, నీళ్లు సమానంగా వేసుకుని కలపాలి. అంటే పావు కప్పు పంచదారకి పావు కప్పు నీళ్లు పోసుకోవాలి.
2. పంచదార కరిగాక అందులో మైదా, రవ్వ, యాలకుల పొడి, నెయ్యి, ఉప్పు వేసుకోవాలి.
3. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి.
4. ఈ పిండితో ఉండలు చేసుకుని పరాటాల్లాగా కాస్త మందంగా ఒత్తుకోవాలి.
5. ఇప్పుడు చాకు సాయంతో వీటిని రాంబస్ ఆకారంలో గీతలు గీసి కట్ చేసుకోవాలి.
6. కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక ఈ ముక్కల్ని వేసుకుని మీడియం మంట మీద బాగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి.
7. ఇవి చల్లారాక క్రిస్పీగా తయారవుతాయి. వీటిని గాజు డబ్బాలో వేసి పెట్టుుంటే వారమైనా నిల్వ ఉంటాయి. మంచి స్నాక్ లాగా పనికొస్తాయి.