DIY Mosquito Repellents: ఈ నూనెలతో స్ప్రే తయారు చేసి వాడారంటే దోమలు మాయం, ఏ రసాయనాలు లేని పద్ధతులు-how to make diy natural mosquito repellents or mosquito killing liquids at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diy Mosquito Repellents: ఈ నూనెలతో స్ప్రే తయారు చేసి వాడారంటే దోమలు మాయం, ఏ రసాయనాలు లేని పద్ధతులు

DIY Mosquito Repellents: ఈ నూనెలతో స్ప్రే తయారు చేసి వాడారంటే దోమలు మాయం, ఏ రసాయనాలు లేని పద్ధతులు

Koutik Pranaya Sree HT Telugu
Sep 08, 2024 10:30 AM IST

DIY Mosquito Repellents: దోమల వల్ల ఏ రోగాలు వస్తాయోనని భయం ఎక్కువైపోయింది. ఇంట్లో దోమలు రాకూడదంటే ఈ సింపుల్ స్ప్రేలు తయారు చేసుకుని వాడండి. దోమలు చాలా మట్టుకు రాకుండా ఉంటాయి.

సహజ మస్కిటో రిపెల్లెంట్లు
సహజ మస్కిటో రిపెల్లెంట్లు (freepik)

దోమల వల్ల వ్యాప్తిచెందుతున్న వ్యాధులు మనదాకా వస్తాయేమోననే భయం ఎక్కువైపోయింది. దోమ కుట్టిందంటే భయపడాల్సిన పరిస్థితి. ఈ దోమల బెడద నుంచి రక్షించుకోవడానికి రకరకాల మస్కిటో కాయిల్స్‌, అగరత్తులు, లిక్విడ్‌లు లాంటి వాటి మీద ఆధార పడాల్సిందే. అయితే వీటిలో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. అందుకే అవి దోమల్ని చంపేంత శక్తివంతంగా ఉంటాయి. వీటి తాలూకు పొగ, వాసన దీర్ఘ కాలంపాటు మనం పీల్చుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ పొగను పీల్చగానే దగ్గు, గొంతు నొప్పి లాంటివి ఇబ్బంది పెడుతుంటాయి.

బదులుగా దోమల్ని తరిమికొట్టే ఈ మస్కిటో రిపెల్లెంట్ లిక్విడ్‌ స్ప్రేలు మీరే తయారు చేయొచ్చు. ఎలాంటి రసాయనాలనూ ఇందులో వాడాల్సిన అవసరం ఉండదు. అదెలాగో తెలుసుకుందాం.

వేప నూనె స్ప్రే :

రాత్రి పూట ఒక స్ప్రే డబ్బాలో కప్పుడు నీళ్లు పోసి అందులో ఒక టీ స్పూను వేప నూనెను వేసి షేక్ చేస్తూ బాగా కలపాలి. దాన్ని గది మూలల్లో, మంచాల కింద స్ప్రే చేయడం వల్ల దోమల బెడద తగ్గుతుంది. పెద్దవాళ్లు ఈ మిశ్రమాన్ని నేరుగా చర్మానికి రాసుకున్నా దోమలు కుట్టకుండా ఉంటాయి. వేపనూనె ఎలర్జీ లేదని నిర్దారించుకున్నాక ఇది వాడండి.

టీ ట్రీ ఆయిల్‌ స్ప్రే :

ఈ నూనె వాసనకు దోమలు దరి చేరవు. ఇంకా ఈ టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దోమలు కుట్టినా వాటి వల్ల వచ్చే దద్దుర్లలాంటివి తగ్గుతాయి. అరకప్పు కొబ్బరి నూనెను తీసుకుని అందులో పది చుక్కల వరకు టీ ట్రీ ఆయిల్‌ని వేయండి. నీళ్లో ఈ మిశ్రమాన్ని కలిపి ఇల్లంతా స్ప్రే చేయండి. ఇది బాగా పని చేస్తుంది.

ఎసెన్షియల్‌ ఆయిల్‌ స్ప్రే :

లావెండర్‌ ఆయిల్‌, పెప్పర్‌మింట్ ఆయిల్‌, సిట్రోనెల్లా ఆయిల్‌, యూకలిప్టస్‌ ఆయిల్‌... లాంటి ఎసెన్షియల్‌ నూనెల్లో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. అలాగే అర కప్పు వరకు కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఈ నూనెలో పది చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలపి స్ప్రే సీసాలో పోసుకుని పెట్టుకోవాలి. ఇది మనం చర్మంపై రాసుకోవచ్చు. మూలల్లో ఒక వస్త్రాన్ని ఉంచి దాని మీద స్ప్రే చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ వాసనలకు దోమలు దూరంగా వెళ్లిపోతాయి. ఒక్కసారి ఈ నూనెల్ని తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు వాడుకోవచ్చు.

లెమన్‌ యూకలిప్టస్‌ ఆయిల్‌ స్ప్రే :

మార్కెట్‌లో లెమన్‌ యూకలిప్టస్‌ నూనె అనేది నేరుగా అందుబాటులో ఉంటుంది. రాత్రి దీన్ని ఉపయోగించాలని అనుకున్నప్పుడు ఒక స్ప్రే బాటిల్లో కప్పుడు నీళ్లు పోసి, అందులో ఈ ఆయిల్‌ని వేసి మూలల్లో స్ప్రే చేయవచ్చు. దోమల బాధ చాలా మట్టుకు తగ్గిపోతుంది.