Curd rice: రెస్టారెంట్ లాంటి క్రీమీ, కమ్మటి కర్డ్ రైస్ రెసిపీ, సీక్రెట్ టిప్స్ ఇవే
Curd rice: రెస్టారెంట్ రుచిలో కర్డ్ రైస్ ఇంట్లోనే చేసుకోవచ్చు. అదే రుచి రావాలంటే కొన్ని చిట్కాలు తెల్సుకోండి చాలు. పక్కా కొలతలతో రెసిపీ ఎలాగో చూసేయండి.
కర్డ్ రైస్
ఇంట్లో పెరుగన్నం తినని వాళ్లు కూడా రెస్టారెంట్‌లో కర్డ్ రైస్ తినడానికి ఇష్టపడతారు. అలానీ ఇంట్లో కర్డ్ రైస్ చేసినా అలాంటి రుచి రాదు. దానికోసం రెస్టారెంట్ వాళ్ల రెసిపీ ఎలాగో చూసేయండి. కొన్ని స్పెషల్ టిప్స్ కూడా చివర్లో చదివి గుర్తుంచుకోండి.
కర్డ్ రైస్ తయారీకి కావాల్సినవి:
4 కప్పుల అన్నం
2 కప్పుల పెరుగు
సగం కప్పు చిక్కటి మీగడ పాలు
3 పచ్చిమిర్చి, సన్నటి ముక్కల తరుగు
చిన్న అల్లం ముక్క, సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి
గుప్పెడు కొత్తిమీర, సన్నటి తరుగు
అర టీస్పూన్ ఉప్పు
2 చెంచాల నూనె
అర టీస్పూన్ శనగపప్పు
అర టీస్పూన్ మినప్పప్పు
అర టీస్పూన్ ఆవాలు
అర టీస్పూన్ జీలకర్ర
కొన్ని జీడిపప్పు ముక్కలు
కొన్ని ఎండుద్రాక్ష
1 కరివేపాకు రెమ్మ
2 ఎండుమిర్చి
చిటికెడు ఇంగువ
గుప్పెడు దానిమ్మ గింజలు
కర్డ్ రైస్ తయారీ విధానం:
- కర్డ్ రైస్ కోసం అప్పుడే చేసుకున్న అన్నం వాడితే మంచిది. మెత్తగా ఉడికించుకున్న అన్నాన్ని కాస్త చెంచాతో మెదిపనట్టు చేయాలి.
- అందులో పెరుగు, మీగడ పాలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా అనిపిస్తే కాస్త పెరుగు కానీ, పాలు కానీ కలుపుకోండి.
- అందులోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. కారం వద్దనుకుంటే పచ్చిమిర్చి వేసుకోకండి.
- ఇప్పుడు తాలింపు కోసం రెండు చెంచాల నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించాలి. అవి వేగాక అందులోనే జీడిపప్పు, ఎండుద్రాక్ష, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి కూడ వేయాలి.
- కాస్త వేగిపోయాక దీన్ని రెండు నిమిషాలు పక్కన పెట్టుకోండి. వేడి తగ్గిపోగానే ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో ఈ తాలింపు కలిపేసుకోండి.
- చివరగా దానిమ్మ గింజలు వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అచ్చం రెస్టారెంట్ రుచి రావడం ఖాయం.
కర్డ్ రైస్ కోసం చిట్కాలు:
- అన్నం పూర్తిగా చల్లారాకే పెరుగును కలపండి.
- మీగడ పాలు కలపడం వల్ల కర్డ్ రైస్ క్రీమీగా వస్తుంది. పులుపు కూడా తగ్గి కమ్మదనం పెరుగుతుంది.
- రుచి మరింత పెరగడానికి కీరదోస, క్యారట్ తురుముకుని ఈ అన్నంలో కలిపేసుకోవచ్చు.
- తాజా పెరుగు వాడితే మంచిది.
- తాలింపు వేడి తగ్గాకే అన్నంలో కలపండి. అలాగే ఇంగువ వేయడం మర్చిపోకండి. ఇది ప్రత్యేక రుచినిస్తుంది.