Pomegranate peels: దానిమ్మ తొక్కలు పడేయకుండా ఇలా వాడండి, చర్మం మెరిసిపోతుంది
Pomegranate peels: దానిమ్మ తొక్కలను వృథాగా పడేయకండి. వాటిని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుంటే ముఖం అందం పెంచడంలో సాయపడతాయి. ఈ పొడితో ఎలాంటి ఫేస్‌ప్యాక్స్ వేసుకోవచ్చో చూడండి.
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి మంచి సంరక్షణ అవసరం. ముఖ్యంగా మహిళలు 30 ఏళ్లకు దగ్గరబడుతుంటే ఒక నిర్దిష్ట స్కిన్‌కేర్ ను రొటీన్ గా మార్చుకోవాలి. దానికోసం ఖరీదైన క్రీములే వాడక్కర్లేదు. ఇంట్లో వంటగదిలో ఉండే అనేక పదార్థాలు చర్మం అందాన్ని పెంచుతాయి. యవ్వనంగా మారుస్తాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ దానిమ్మ తొక్కల ఫేస్‌ప్యాక్. దాన్ని మీ చర్మం మెరిపించడానికి ఎలా వాడొచ్చో చూడండి.
దానిమ్మ తొక్కలను ఇలా వాడండి:
దానిమ్మ తొక్కలను చర్మంపై ఉపయోగించాలంటే ముందుగా దానిమ్మ తొక్కలను బాగా కడిగేయాలి. తర్వాత జల్లెడలో వేసి అందులోని నీళ్లన్నీ పూర్తిగా వడిచి పోయేదాకా ఉంచండి. తర్వాత తొక్కలను కాటన్ గుడ్డ మీద వేసి ఎండలో అవి బాగా ఎండిపోయాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి అందం కోసం వాడుకోవడానికి సిద్దం అయినట్లే.
దానిమ్మ ఫేస్‌ప్యాక్‌లు:
పెరుగుతో దానిమ్మ తొక్కల పొడి:
ఒకటిన్నర చెంచా పెరుగులో ఒక చెంచాడు దానిమ్మ తొక్కల పొడి కలపాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక ఫేస్ ప్యాక్ ఆరిపోతుంది. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెల్లగా చర్మాన్ని రుద్దుతూ కడిగేసుకుంటే స్క్రబ్ చేసినట్లుంటుంది. చర్మం మీద మృతకణాలు తొలిగిపోయి ముఖంలో మెరుపు వస్తుంది.
ఓట్స్ కలిపి:
ఈ పొడిని ఓట్స్ తో మిక్స్ చేసి ముఖానికి స్క్రబ్ లాగా చేసుకోవచ్చు. ఇందుకోసం ఓట్స్‌ను ముందు పొడి చేసుకోవాలి. దాంట్లో దానిమ్మ తొక్కల పొడి, తేనె, పాలు కలపాలి. చిక్కటి మిశ్రమం తయారయ్యాక దీన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్బింగ్ చేయాలి. డెడ్ స్కిన్ తొలగించడానికి, ముఖం మీద మరకలను తొలగించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
రోజ్ వాటర్ తో:
దానిమ్మ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్ వాటర్ తో మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. రోజ్ వాటర్ లోని సుగుణాలు, దానిమ్మలోని ఔషద గుణాలు ముఖాన్ని మెరిపిస్తాయి.
ఏ ఫేస్ ప్యాక్ రాసుకున్నా ముఖంతో పాటూ మెడకు రాసుకోవడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా ప్రయత్నిస్తుంటే ముందుగా చేయి మీద లేదా ఎక్కడైనా ఒకసారి రాసుకుని ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. దురద, ఎరుపెక్కడం, దద్దుర్లు లాంటివి రాకపోతే ముఖానికి వాడొచ్చు. లేదంటే వాడకూడదు. ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్నవాళ్లు ఈ జాగ్రత్త పాటించడం తప్పనిసరి.
టాపిక్