Corn recipe: గిన్నెలు ఖాళీ చేయించే కార్న్ సూప్, క్రీమీ కార్న్ రెసిపీలు..
Corn recipe: మొక్కజొన్న గింజలతో హెల్తీ కార్న్ క్యారట్ సూప్, రుచిలో అదిరిపోయే క్రీమీ కార్న్ ఎలా చేయాలో చూసేయండి.
నాతో పాటూ చాలా మంది ఎదురుచూసే మొక్కజొన్నల సీజన్ వచ్చేసింది. స్నాక్స్, బిర్యానీలు, పులావ్ లు, అల్పాహారాలు.. మొక్కజొన్నతో ఏమైనా చేసుకోవచ్చు. ఇంట్లో రెండు మొక్కజొన్న పొత్తులుంటే ఇలా రుచిగా సూప్, క్రీమీగా ఉండే కార్న్ స్నాక్ చేసి పెట్టండి. సాయంత్రం పూట వర్షం పడుతుంటే వేడివేడిగా వీటిని చేసిస్తే తినడానికి హాయిగా ఉంటుంది. పిల్లలూ, పెద్దలు గిన్నెలు ఖాళీ చేయడం ఖాయం. ఈ రెండూ ఎలా తయారు చేయాలో చూడండి.
1. కార్న్ క్యారట్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు ఉడికించిన మొక్కజొన్న గింజలు
2 క్యారట్లు, సన్నం ముక్కలు
పావు కప్పు బీన్స్ తరుగు
2 కప్పుల నీళ్లు
సగం చెంచా ఉప్పు
పావు చెంచా మిరియాల పొడి
పావు టీస్పూన్ పంచదార
2 చెంచాల కార్న్ ఫ్లోర్
అరచెక్క నిమ్మరసం
గుప్పెడు కొత్తిమీర
1 చెంచా బటర్
సగం చెంచా వెల్లుల్లి తరుగు లేదా గార్లిక్ పౌడర్
కార్న్ క్యారట్ సూప్ తయారీ విధానం:
- ముందుగా కుక్కర్లో మొక్కజొన్న గింజలు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
- అదే కుక్కర్లో కప్పు నీల్లు పోసుకుని క్యారట్ ముక్కలు, బీన్స్ వేసుకుని ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించాలి.
- వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.
- ఉడికించిన కూరగాయలు, కార్న్ మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- ఒక ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. అది కరిగాక కూరగాయల మిశ్రమం, రెండు కప్పుల నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి.
- ఉప్పు, మిరియాల పొడి, గార్లిక్ పౌడర్ , పంచదార కూడా వేసుకుని ఉడుకు రానివ్వాలి.
- రెండు నిమిషాలయ్యాక కార్న్ ఫ్లోర్ మిశ్రమం వేసుకోవాలి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్ తీసుకుని నీళ్లలో కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరగాయ మిశ్రమంలో పోసుకోవాలి.
- బాగా కలుపుకుని మరో రెండు నిమిషాలు ఆగి స్టవ్ కట్టేయాలి. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
2. క్రీమీ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న గింజలు
1 కప్పు హెవీ క్రీం లేదా చిక్కటి పాలు
1 చెంచా పంచదార
2 చీజ్ స్లైసులు
2 చెంచాల బటర్
పావు టీస్పూన్ మిరియాలపొడి
సగం చెంచా ఉప్పు
క్రీమీ కార్న్ తయారీ విధానం:
- ముందుగా మొక్కజొన్న గింజల్ని ఒక పెద్ద పాత్రలో వేసుకోవాలి. దాంట్లోనే క్రీం లేదా పాలు, పంచదార పోసుకోవాలి.
- సన్నం మంట మీద వీటిని అన్నీ కలిపి 5 నిమిషాలు అయ్యేదాకా ఉడికించుకోవాలి.
- మొక్కజొన్న గింజలు ఉడికాక అందులోనే చీజ్, బటర్ వేసుకుని మరో రెండు నిమిషాలు ఉడికించాలి.
- చివరగా ఉప్పు, మిరియాల పొడి వేసి సర్వ్ చేసుకోవడమే. ఇష్టం ఉంటే చివరగా చీజ్ స్లైసులతో పాటూ పర్మేసన్ చీజ్ తురుము కూడా వేసుకోవచ్చు. దీంతో రుచి మరింత బాగుంటుంది. అది కరిగాక సర్వ్ చేసుకుంటే మరింత రుచి.