Cashew, Almond butter: పీనట్ బటర్ కన్నా టేస్టీగా.. కాజూ బటర్, బాదాం బటర్ చేసేయండి-how to make cashew and almond butter at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cashew, Almond Butter: పీనట్ బటర్ కన్నా టేస్టీగా.. కాజూ బటర్, బాదాం బటర్ చేసేయండి

Cashew, Almond butter: పీనట్ బటర్ కన్నా టేస్టీగా.. కాజూ బటర్, బాదాం బటర్ చేసేయండి

Koutik Pranaya Sree HT Telugu
Aug 13, 2024 03:30 PM IST

Cashew, Almond butter: ఇంట్లోనే జీడిపప్పు బటర్, బాదాం బటర్ తయారు చేసుకోవచ్చు. వీటితో రుచితో పాటే ఆరోగ్యం కూడా. వాటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

జీడిపప్పు బటర్, బాదాం బటర్
జీడిపప్పు బటర్, బాదాం బటర్ (freepik)

పిల్లలకు బ్రెడ్ మీద పీనట్ బటర్ రాసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే బయట మార్కెట్లో కొన్న పీనట్ బటర్ పిల్లలకు మంచిదా కాదా అనే సందేహం ఉంటుంది. దాంట్లో చక్కెర స్థాయులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే దాన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటారు చాలా మంది. అయితే ఈసారి పల్లీలకు బదులు బాదాంతో ఆల్మండ్ బటర్, కాజూ లేదా జీడిపప్పు వాడి క్యాష్యూ బటర్ తయారు చేయండి. చాలా రుచిగా ఉంటాయి. మరింత ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదూ మీకూ నచ్చేస్తుంది. రుచితో పాటూ ఆరోగ్యం కూడా.

1. ఆల్మండ్ లేదా బాదాం బటర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

3 కప్పుల బాదాం

పావు టీస్పూన్ ఉప్పు

పావు టీస్పూన్ దాల్చినచెక్క పొడి

పావు టీస్పూన్ వెనీలా ఎసెన్స్ (ఆప్షనల్)

3 చెంచాల తేనె

బాదాం బటర్ తయారీ విధానం:

1. ముందుగా కడాయి పెట్టుకుని వేడెక్కాక బాదాంను కనీసం 5 నిమిషాలు వేయించుకోవాలి. అవి రంగు మారి కాస్త వాసన రావడం మొదలయ్యాక స్టవ్ కట్టేయాలి.

2. వేయించుకున్న బాదాంను ఒక ప్లేట్లో తీసుకుని చల్లారేదాకా ఆగాలి.

3. బాదాం బటర్ తింటున్నప్పుడు మధ్యలో చిన్న చిన్న బాదాం పలుకులు రావాలి అనుకుంటే.. ముందుగా గుప్పెడు బాదాం గింజల్ని పక్కన పెట్టుకోవాలి.

4. వీటిని ఒకసారి మిక్సీలో వేసి ఒక రెండు సార్లు తిప్పాలి. అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. 5. మిగిలిన బాదాం గింజల్ని మిక్సీలో వేసుకోవాలి. కనీసం ఏడెనిమిది సార్లు మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. ముందు బాదాం పొడిగా మారి తర్వాత మెత్తగా, పేస్ట్ లాగా అయిపోతాయి. ఒకవేళ మెత్తదనం సరిపోకపోతే అందులో రెండు చెంచాల కొబ్బరి నూనె కలుపుకోవచ్చు.

6. నూనె వేసుకున్నాక మళ్లీ కాసేపు మిక్సీ పడితే మెత్తగా వెన్నలాగా అయిపోతుంది. చివరగా దాల్చిన చెక్క పొడి,ఉప్పు,తేనె, వెనీలా ఎసెన్స్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఆల్మండ్ లేదా బాదాం బటర్ రెడీ అయినట్లే. ఒకసారి రుచి చూసి మీకింకేమైనా అవసరం అనుకుంటే కలుపకుంటే సరిపోతుంది.

2. క్యాష్యూ బటర్ లేదా కాజూ బటర్ తయారీ:

పైన బాదాం బటర్ తయారీకి వాడిన కొలతలతోనే కాజూ బటర్ తయారు చేసుకోవచ్చు. అయితే కాజూ బటర్ తయారీలో దాల్చినచెక్క, వెనీలా ఎసెన్స్ వేయక్కర్లేదు. కొద్దిగా తేనె, ఉప్పు వేసుకుని కాజూ బటర్ తయారు చేసుకోవడమే. కాజూను వేయించుకుని మిక్సీ పట్టుకుంటే మెత్తగా తయారవుతాయి. పొడిగా అనిపిస్తే 2 చెంచాల కొబ్బరి నూనె వేసుకుని మళ్లీ మిక్సీ పట్టుకుంటూ ఉండాలి. మెత్తగా క్రీమీగా అయిపోతుంది. అంతే.. కాజూ బటర్ రెడీ అయినట్లే.

పిల్లలకు బ్రెడ్ మీద, కుకీస్ మీద , కేకుల్లో ఈ ఆల్మండ్ బటర్ లేదా కాజూ బటర్ వాడుకోవచ్చు. ఒక గాజు సీసాలో ఈ బటర్ తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే చాలు. చాలా వారాల పాటూ నిల్వ ఉంటాయివి.

Whats_app_banner