Badam Paneer: కాజూ కాదు.. బాదాం పన్నీర్ రుచి ఒక్కసారి చూడండి..-know how to cook badam paneer with perfect measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Badam Paneer: కాజూ కాదు.. బాదాం పన్నీర్ రుచి ఒక్కసారి చూడండి..

Badam Paneer: కాజూ కాదు.. బాదాం పన్నీర్ రుచి ఒక్కసారి చూడండి..

Koutik Pranaya Sree HT Telugu
Aug 04, 2024 11:30 AM IST

Badam Paneer: బాదాం పన్నీర్ రుచి చూడకపోతే ఒక్కసారి ప్రయత్నించండి. మరే పన్నీర్ కర్రీ ఇది తిన్నాక నచ్చదు.

బాదాం పన్నీర్
బాదాం పన్నీర్

పన్నీర్ కూర అంటే ఎక్కువగా కాజూ పన్నీర్, కడాయి పన్నీర్, బుర్జీ.. ఇలాంటివే వింటాం. బాదాంతో చేసే పన్నీర్ గురించి తక్కువ మందికే తెలుస్తుంది. కాజూతోనే కాకుండా బాదాంతో కూడా రుచిగా పన్నీర్ చేసుకోవచ్చు. దీంతో కూడా మంచి రుచి వస్తుంది. ఎంత ఎక్కువ బాదాం వేసుకుంటే కూరకు అంత ఎక్కువ రుచి. మరి దాన్నెలా తయారు చేయాలో, తయారీ విధానమేంటో వివరంగా చూసేయండి.

బాదాం పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

200 గ్రాముల పన్నీర్

4 చెంచాల కసూరీ మేతీ

అరకప్పు బాదాం గింజలు

1 ఉల్లిపాయ, సన్నటి ముక్కలు

3 టమాటాలు, సన్నటి ముక్కలు

4 వెల్లుల్లి రెబ్బలు

1 చెంచా అల్లం తరుగు

2 చెంచాల ఫ్రెష్ క్రీం

1 టీస్పూన్ జీలకర్ర

1 చెంచా గరం మసాలా

1 చెంచా కారం

పావు చెంచా పసుపు

తగినంత ఉప్పు

2 చెంచాల నూనె

గుప్పెడు కొత్తిమీర తరుగు

బాదాం పన్నీర్ తయారీ విధానం:

1. ముందుగా బాదాం గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టుకోవాలి.

2. అలాగే కసూరీ మేతి కూడా కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పడు మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, నానబెట్టుకున్న బాదాం, అల్లం, వెల్లుల్లి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే రెండు చెంచాల నీళ్లు పోసుకోవాలి.

4. ఇప్పుడు ఒక వంట పాత్ర తీసుకుని అందులో చెంచా నూనె వేసుకోవాలి. వేడెక్కాక పన్నీర్ ముక్కలు వేసుకుని కాస్త బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు కడాయిలో చెంచా నూనె వేసుకుని వేడెక్కాక జీలకర్ర వేసుకుని చిటపటలాడనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మగ్గనివ్వాలి. కాస్త బంగారు వర్ణంలోకి రావాలి.

6. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాక అందులోనే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బాదాం మిశ్రమం కూడా వేసుకోవాలి.

7. ఇప్పుడు అన్నీ ఒకసారి కలుపుకుని పసుపు, గరం మసాలా, కారం, పంచదార అన్ని వేసుకొని మరోసారి కలుపుకోవాలి.

8. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న కసూరి మేతిని కూడా వేసి మరోసారి కలియబెట్టాలి.

9. మూత మూసి ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి. స్టవ్ సన్న మంట మీద పెట్టి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసుకొని మరోసారి అన్ని కలిసేలా కలుపుకోవాలి. మూత మూసుకొని రెండు నిమిషాల పాటు పన్నీర్ ముక్కల్ని మసాలాలో ఉడకనివ్వాలి.

10. గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.

11. కర్రీ చిక్కగా ఉండాలనుకుంటే కాస్త మీగడ రుచితో కావాలి అనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా కలుపుకోవచ్చు లేదంటే వదిలేయవచ్చు. దీనివల్ల కూరకి మంచి చిక్కదనం వస్తుంది చివరగా ఈ క్రీమ్ లేదా పాల మీద ఉండే మీగడైనా వేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర తరుగు కూడా చల్లుకొని వేడివేడిగా వడ్డించండి. బాదాం పన్నీర్ రెడీ అయినట్లే.

టాపిక్