Cheating partner: భాగస్వామి మోసం చేస్తున్నారనిపిస్తే.. ఎలా డీల్ చేయాలి..
Cheating partner: బంధంలో అనుమానాలకు తావు ఉండకూడదు. కానీ మీరు మోసపోతున్నారనే విషయంలో మీకు స్పష్టత వస్తే ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్లాలో ఆలోచించాల్సిందే.
భార్య, భర్త, ప్రేయసి, ప్రియుడు.. ఇలాంటి సంబంధాల్లో ఇద్దరి మధ్య ప్రేమలైనా, గొడవలైనా బాగానే ఉంటాయి. వీరి రిలేషన్‌షిప్‌లోకి మూడో వ్యక్తి వస్తేనే సమస్యలు అన్నీ మొదలవుతాయి. మన భాగస్వామి మనతో కంటే వారితో గడపడానికే ఇష్టపడుతున్నారు అనుకున్నప్పుడు, మనల్ని కంటే వారినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి. ఆ రిలేషన్‌ని కొనసాగించాలా వద్దా? లాంటి చాలా సందేహాలు మనలో మొదలవుతుంటాయి. ఇవి పెరిగి పెరిగి చివరికి ప్రాణాలను తీసే స్థాయికి లేదా ప్రాణాల్ని తీసుకునే స్థాయికీ కూడా వెళుతుంటాయి. అలాంటి ఘటనలను మన కళ్ల ముందే చాలా చూసుంటాం. మరి మన భాగస్వామి మనల్ని మోసం చేస్తున్నాడని పక్కాగా అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
నిజా నిజాలను ఒకటికి పది సార్లు ధృవీకరించుకోవాలి:
వాళ్లూ వీళ్లూ చెప్పే మాటల ఆధారంగా కాకుండా మీ భాగస్వామి వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారన్న విషయంలో ఉన్న నిజా నిజాలను మీ అంతట మీరే స్వయంగా ధృవీకరించుకోవాలి. వంద శాతం అది నిజమని అనుకున్నప్పుడు మాత్రమే తర్వాత ఏంటి అనే దాన్ని ఆలోచించాలి.
మీ బంధాన్ని కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయానికి రావాలి :
మీరు మీ భాగస్వామికి ఇవ్వలేని దాన్ని అవతలి వారు ఏమి ఇవ్వగలుగుతున్నారు? అనే దానిపై స్పష్టత తెచ్చుకోవాలి. భవిష్యత్తులో మరో బంధంలో మోసపోకుండా ఉండటానికి దాన్ని పాఠంలా గుర్తుంచుకోవాలి. తర్వాత ఆ బంధాన్ని ఆపివేయాలా? కొనసాగించాలా అన్న దానిపై స్పష్టత తెచ్చుకోవాలి. వారు లేకుండా నేను బతకలేను లాంటి మాటలకు మనసులో బలంగా చెక్ పెట్టాలి. ప్రేయసీ ప్రియుల విషయంలో అయితే ఈ నిర్ణయం కాస్త తేలికగానే ఉంటుంది. కానీ భార్యా భర్తల విషయానికి వచ్చేసరికి పరిస్థితులు, సంపాదన, పిల్లలు, వారి భవిష్యత్తు.. ఇలా అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించాల్సి ఉంటుంది. భర్త లేదా భార్యను మార్చుకునే అవకాశం ఉందనుకుంటే అన్ని రకాలుగా ప్రయత్నించడమే మొదటి ఉత్తమ మార్గం.
లక్ష్యాలను మరల్చుకోండి:
ఇలాంటి బంధాల మధ్య పడి ఇరుక్కుని మిమ్మల్ని మీరు బాధించుకోకండి. బదులుగా మెరుగైన లక్ష్యాలను ఏర్పర్చుకోండి. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడి మీ వ్యక్తిగత వికాసానికి, అభివృద్ధికి తోడ్పడే పనులను చేసే ప్రయత్నం చేయండి. మీరు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు బిజీ షెడ్యూల్‌లో ఉంచుకోండి. అప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించే తీరికే మీకు ఉండదు. మీరు ఎదుగుతున్నారు అనుకున్నప్పుడు మీ భాగస్వామి కూడా మీ పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తారు. ఇక పరిస్థితులు మరీ విసుగుగా మారి, వారిని మీరు ఏ మాత్రం సహించలేని స్థితికి వస్తే మాత్రం రిలేషన్‌షిప్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన సమయం వచ్చిందని గుర్తించండి.