Food Timings : భోజనం చేసే సమయాలతో ఎలాంటి ప్రభావం ఉంటుంది?
Food Timings : ఎవరైనా.. సమయానికి తినాలనే చెబుతారు. లేటుగా తింటే.. లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం కూడా సరైన సమయానికి తినాలనే చెబుతోంది. మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు టైమింగ్స్ మరింత ముఖ్యం.
తినడం సరిగా ఉంటే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఏ వైద్యుడి దగ్గరకు వెళ్లినా ఇదే విషయం చెబుతాడు. మీ భోజనం చేసే సమయం మీ జీవక్రియ(Metabolism)ను ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి, బయోలాజికల్ క్లాక్ ప్రకారం తినడం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఆకలి అనిపించే సమయం మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఫాలో అయిపోతే మంచిది. శరీరం అవసరమైన పోషకాలను బాగా గ్రహిస్తుంది. కానీ బిజీ లైఫ్ స్టైల్స్(Lifestyle) వల్ల చాలా మంది చాలా ఆలస్యంగా భోజనం చేస్తారు.
ఆహారపు అలవాట్లు బరువు తగ్గడానికి(weight loss) కూడా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఆరోగ్యకరంగా బరువు తగ్గడం మంచిది. మీ భోజనం సమయం.., మీ బరువు మీద, మొత్తం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది.
బరువు తగ్గడానికి పోషకాలతో కూడిన అల్పాహారం(Breakfast) తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది రోజును ప్రారంభించడానికి శరీరానికి అవసరమైన శక్తిని, పోషకాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గుడ్లు(Eggs) లేదా పెరుగు వంటి అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం, అతిగా తినాలనే కోరికలను తగ్గించడానికి, రోజంతా సంపూర్ణంగా ఉండేందుకు సహాయపడుతుంది. మరోవైపు అల్పాహారం దాటవేయడం కూడా మంచిది కాదు. దీని కారణంగా రోజులో అతిగా తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు. సరైన సమయానికి అల్పాహారం తీసుకుంటే.. చాలా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
ప్రోటీన్, తృణధాన్యాలు, కూరగాయలతో కూడిన సమతుల్య మధ్యాహ్న భోజనం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం పూట కడుపు నిండిన అనుభూతిని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. ఎక్కువ లంచ్, తక్కువ డిన్నర్(Dinner) తినడం వల్ల బరువు తగ్గవచ్చు. కొవ్వు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. అయితే ఇది డైలీ ఒక ఫిక్స్ టైమ్ పెట్టుకుని తినండి. ఓ రోజు ఒంటి గంట, మరో రోజు మూడు గంటలకు తినడం చేయోద్దు.
లీన్ ప్రొటీన్, కూరగాయలతో కూడిన తేలికపాటి డిన్నర్ తినడం, రోజు మొత్తం క్యాలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువ డిన్నర్ తినడం మంచిది కాదు. సాయంత్రం శరీరం చురుకుగా ఉండదు. రోజంతా పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. అదనపు కేలరీలను బర్న్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు పెరగడానికి దారితీస్తుంది. మనం తినే ఆహారం సమయాలు.. తర్వాత తినే దాని మీద ప్రభావితం చూపించొచ్చు. సరైన సమయంలో తింటే అన్నింటికి మంచిది.