Sugar limit: రోజూ ఎంత చక్కెర తింటే ఆరోగ్యంపై ప్రభావం ఉండదు? వయసు బట్టి మోతాదులు ఇవే-how much sugar intake safe on daily basis according to age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sugar Limit: రోజూ ఎంత చక్కెర తింటే ఆరోగ్యంపై ప్రభావం ఉండదు? వయసు బట్టి మోతాదులు ఇవే

Sugar limit: రోజూ ఎంత చక్కెర తింటే ఆరోగ్యంపై ప్రభావం ఉండదు? వయసు బట్టి మోతాదులు ఇవే

Koutik Pranaya Sree HT Telugu
Jul 14, 2024 08:00 AM IST

Sugar limit: తీపి ఆహారాన్ని ఇష్టపడేవాళ్లు రోజంతా ఎంత చక్కెర తినాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మోతాడు తెల్సుకోవడం ద్వరా ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుంది.

రోజూవారీ పంచదార మోతాదు
రోజూవారీ పంచదార మోతాదు (shutterstock)

చక్కెర ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా హానికరం. కానీ తీపి అంటే ఇష్టపడే వాళ్ల సంగతేంటి. తరచుగా స్వీట్లు తినేవారికి, తీపి లేకుండా భోజనం ముగించని వాళ్లకి పంచదారకు దూరంగా ఉండటం కష్టంగా అనిపిస్తుంది. కానీ తీపి ఎక్కువగా తింటే మధుమేహం వంటి వ్యాధులతో పాటూ ఇతర రకాలు ఆరోగ్య సమస్యలకూ దారి తీయవచ్చు. కాబట్టి చాలా మంది తీపి అంటేనే తినడానికి భయపడుతున్నారు. అందుకే డబ్ల్యూ‌హెచ్‌ఓ చక్కెర వినియోగానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో రోజుకు ఎంత చక్కెర తింటే ఆరోగ్యంగా, రోగాల బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చని పేర్కొన్నారు.

తీపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగడంతో పాటే బలహీనత, మైకం లాంటి సమస్యలు రావచ్చు. అలాగే బరువు అధికంగా పెరగడం, దంతక్షయం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా ధరి చేరుతాయి. అందుకే వీలైనంత స్వీట్లకు, పంచదారకు దూరంగా ఉండటం మంచిది.

రోజుకు ఎంత పంచదార తినాలి?

చక్కెరలు, తీపి అంటే కేవలం నేరుగా తీసుకునే పంచదార మాత్రమే కాదు. తేనె, పండ్లరసాలు, ఫ్రూట్ సిరప్స్ లాంటి వాటిలో ఉండే చక్కెరలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతా కలిపి మనం తీసుకునే రోజూవారీ మొత్తం కలిపి 10 శాతం చక్కెరలు తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి రోజుకు రెండువేల కేలరీలు ఆహారంలో తీసుకుంటే అందులో 10 శాతం .. అంటే 50 గ్రాముల కంటే తక్కువ చక్కెరలు ఉండాలన్నమాట. అంటే పది టీస్పూన్ల కంటే తక్కువ చక్కెర.

చిన్న పిల్లలకు ఎంత చక్కెర ఇవ్వచ్చు?

1 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఆరు టీస్పూన్ల చక్కెర.. అంటే 30 గ్రాములు దాటకూడదు. అలాగే 4 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలకు 35 గ్రాముల కన్నా ఎక్కువ చక్కెర ఇవ్వకూడదు. 7 నుంచి 10 ఏళ్ల పిల్లలకు 42 గ్రాములు కంటే తక్కువ చక్కెరలు ఉండేలా చూడాలి. కేవలం మీరు ప్రత్యేకంగా వేసే పంచదారే కాకుండా పిల్లలకు చాకోలేట్లు ఇచ్చినా, నిమ్మరసం ఇచ్చినా, తేనె ఇచ్చినా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఇలా వయసు బట్టి చక్కెర పరిమాణాన్ని తప్పకుండా గమనించే పిల్లలకు ఇవ్వాలి.

సంవత్సరం లోపు పిల్లలకు:

సంవత్సరం నిండని చిన్న పిల్లలు ఆహారం తినకపోతే రుచికోసం కొందరు పంచదార కలుపుతారు. అది తప్పు పిల్లలకు ఏడు నిండేదాకా అస్సలు చక్కెర రుచి తెలీకూడదు. అలాగే మీరు ఏదైనా రెడీమేడ్ ఫుడ్ వాళ్లకి తినిపిస్తే అందులో కూడా ఎలాంటి చక్కెరలు లేవని నిర్దారించుకోవాలి. లేదంటే దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, చక్కెర వ్యాధి బారిన పడటం లాంటి సమస్యలొస్తాయి.

జీవనశైలి ప్రకారంగా..:

చురుకైన, ఆరోగ్య వంతమైన జీవనశైలి ఉన్నవాళ్లకే ఈ సూత్రాలు వర్తిస్తాయి. అసలు వ్యాయామం, జాగింగ్ చేయని పెద్దలు, ఏ ఆటలు ఆడకుండా ఇంట్లోనే ఉండే పిల్లలకు అసలు తీపి ఇవ్వడమే సరికాదు. ఇది వాళ్ల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. బద్దకమైన జీవన శైలి అనుసరించేవాళ్లు చక్కెర అస్సలు తినకూడదు.

Whats_app_banner