Chocolates For Kids: చాక్లెట్ల కోసం పిల్లలు మారాం చేస్తున్నారా? తప్పకపోతే ఇలాంటివి కొనివ్వండి..-which type of chocolates can be given to children ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolates For Kids: చాక్లెట్ల కోసం పిల్లలు మారాం చేస్తున్నారా? తప్పకపోతే ఇలాంటివి కొనివ్వండి..

Chocolates For Kids: చాక్లెట్ల కోసం పిల్లలు మారాం చేస్తున్నారా? తప్పకపోతే ఇలాంటివి కొనివ్వండి..

Koutik Pranaya Sree HT Telugu
Jun 27, 2024 11:00 AM IST

Chocolates For Kids: చిన్నపిల్లలు అడిగారు కదాని ఏదో ఒక చాకోలేట్ కొనివ్వడం అలవాటు చేయకూడదు. అలా చేస్తే వాళ్ల ఆరోగ్యం పాడు చేస్తున్నట్లే. అప్పుడప్పుడు కొనివ్వాల్సి వస్తే చాకోలేట్ ఎలాంటిది కొనివ్వచ్చో చూడండి.

పిల్లలకు ఇవ్వదగ్గ చాకోలేట్ రకాలు
పిల్లలకు ఇవ్వదగ్గ చాకోలేట్ రకాలు (freepik)

చిన్న పిల్లలు ఎవ్వరికైనా చాక్లెట్లంటే చాలా ఇష్టం. వాటిని తినడం వల్ల వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు, దంత సమస్యలు లాంటివి వస్తాయని తల్లిదండ్రులు చాలా మంది భయ పడుతుంటారు. అయినా పిల్లలు మారాం చేసే సరికి కొనిచ్చేస్తుంటారు. మరి అసలు చాక్లెట్లలో ఏమేం రకాలుంటాయి? ఎలాంటి రకాలను పిల్లలకు అప్పుడప్పుడూ ఇవ్వవచ్చు. అనే విషయాలపై తల్లిదండ్రులు అవగాహనతో ఉండాల్సిందే.

మనకు మార్కెట్లో డార్క్‌ చాక్లెట్‌, మిల్క్‌ చాక్లెట్‌, వైట్‌ చాక్లెట్‌, క్యాండీల్లాంటివి దొరుకుతాయి. ఇవి రక రకాల ఫ్లేవర్లలో, బ్రాండ్లలో అందుబాటులో ఉంటాయి. చాక్లెట్‌ని తయారు చేయడంలో ముఖ్యంగా కొకొవా పౌడర్‌ని ఉపయోగిస్తారని మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి చాక్లెట్లలో ఎంత కొకొవా ఉంది?ఎంత పంచదార ఇతర పదార్థాలు ఉన్నాయి? అనేది తెలుసుకుని కొనడం మంచిది. ఆ వివరాలు రేపర్‌పై ఉంటాయి. ఓపికగా వాటిని చదివాల్సిందే.

ఇవి కొన్నిసార్లు కొనివ్వచ్చు:

ఎక్కువగా ఫ్లెయిన్‌ డార్క్‌ చాక్లెట్‌ని కొనిచ్చేందుకు ప్రయత్నించండి. వీటిలో డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ లాంటివి ఉన్నవైనా పర్వాలేదు. డార్క్‌ చాక్లెట్‌ని మితంగా తినడం వల్ల మెదడు పని తీరు మెరుగవుతుంది. దీనిలో ఉండే ఫ్లవనాయిడ్లు అందుకు సహకరిస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించి చురుకుదనాన్ని పెంచుతుంది. దృష్టిని మెరుగు పరుస్తుంది. పరీక్షల సమయంలో చాలా మంది పిల్లలు ఒత్తిడిగా ఫీలవుతుంటారు. అలాంటప్పుడు చిన్న డార్క్‌ చాక్లెట్‌ని వారికి ఇవ్వడంలో తప్పేం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. డార్క్‌ చాక్లెట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అతి నీల లోహిత కిరణాల తాకిడికి చర్మం దెబ్బ తినకుండా రక్షణగా ఉంటాయి. అలాగే చర్మానికి తేమను నిలుపుకునే శక్తిని అందిస్తాయి.

మిల్క్ చాకోలేట్‌లో కూడా కొకొవా శాతం ఎక్కువున్నవి చూడాలి. డార్క్ చాకోలేట్ చేదుగా ఉండటం వల్ల పిల్లలు అంతగా ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ వైట్ చాకోలేట్ లేదా మిల్క్ చాకోలేట్ ఇవ్వచ్చు. కానీ పూర్తిగా స్వీటెనర్లు, కొవ్వలు వాడి తక్కువ కొకొవా ఉన్న చాకోలేట్లు మాత్రం మంచివి కావు.

ఏవి మంచివి కావు?

పిల్లలు చాక్లెట్లు కావాలని మారాం చేస్తుంటే తక్కువ ఖరీదు ఉంటాయి కదా అని క్యాండీలను మాత్రం అస్సలు కొనియ్యకూడదు. అందులో ఉండేదంతా కేవలం పంచదారే. పంచదార పాకంలో ఫ్లేవర్‌, రంగు, ప్రిజర్వేటివ్‌లను కలిపి క్యాండీలను తయారు చేస్తారు. ఇవి తినడం వల్ల పిల్లల్లో శ్వాస కోశ వ్యాధులు రావడం, ఊబకాయం, బరువు పెరగడం లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని చాక్లెట్‌ బార్‌‌లలో కొద్ది పాటి కొకొవా ఉండి ఎక్కువ మొత్తంలో చక్కెర, ఇతర పదార్థాలు ఉంటాయి. ఇవి ఎంత శాతంలో ఉంటాయన్న విషయంపై ఎప్పుడూ అవగాహనతో ఉండి మాత్రమే వీటిని కొనుక్కోవాలి. చాక్లెట్‌ని హై క్యాలరీ ఫుడ్‌ అని చెబుతారు. కాబట్టి అతిగా తినడం వల్ల అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మితంగా మాత్రమే అప్పుడప్పుడూ పిల్లలకు ఇవ్వాలి తప్ప రోజూ ఇవ్వకూడదు.

WhatsApp channel