Spiced Tea Recipe । చక్కెర లేని మసాలా టీ.. ఈ చలికాలంలో ఉంచుతుంది మిమ్మల్ని రోగాల నుంచి ఫ్రీ!
Winter Spiced Tea Recipe: చల్లని చలికాలంలో వేడివేడి మసాలా టీ తాగితే ఆ సుఖమే వేరు. ఆరోగ్యకరంగా స్పైస్డ్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది చూడండి.
శీతాకాలంలో స్వెటర్లు, దుప్పట్లు కప్పుకొని మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుకుంటారు. అయితే మీ శరీరాన్ని బయటి నుంచి మాత్రమే కాకుండా లోపలి నుంచి కూడా వెచ్చగా ఉంచుకోవడం ముఖ్యం. ఒక కప్పు వేడివేడి పానీయం, అందులో కొన్ని దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ, కుంకుమపువ్వు , అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు కలుపుకొని తాగితే, అది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడమే కాకుండా మీ జీవక్రియ రేటును, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఒక కప్పు మసాలా టీ మీ శరీరానికి కావలసిన వెచ్చదనాన్ని అందించి, ఎముకలు కొరికే చలిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ టీ యాంటీ-డయాబెటిక్ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది; ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని మూలికలు మీ జీవక్రియను సహజంగా పునరుద్ధరించడంలో సహాయపడతాయి. షుగర్ వ్యాధి ఉన్నవారికి, హృదయ ఆరోగ్యానికి ఇది బెస్ట్ టీ అని చెప్పవచ్చు. మరీ ఈ స్పైస్డ్ టీని ఎలా చేసుకోవాలో ఈ కింద రెసిపీని అందించాం, చూడండి.
Winter Spiced Tea Recipe కోసం కావలసినవి
- 2 స్పూన్ బ్లాక్ టీ పౌడర్
- 4 కప్పుల నీరు
- 1 చిన్న దాల్చిన చెక్క
- 5 ఏలకులు
- 5 లవంగాలు
- 2 టేబుల్ స్పూన్లు తాజా అల్లం
- 2 స్పూన్ నల్ల మిరియాలు
- ¼ కప్పు బెల్లం లేదా పామ్ షుగర్
స్పైస్డ్ టీ రెసిపీ- మసాలా చాయ్ తయారీ విధానం
- ముందుగా మసాలా దినుసులను దోరగా వేయించి, ఆపై వీటిని ఒక మోర్టార్ లేదా రోకలిలో వేసి మామూలు చూర్ణం చేయండి.
- ఇప్పుడు ఒక పాన్‌లో నీళ్లు తీసుకొని, అందులో బెల్లం వేసి మరిగించాలి.
- అనంతరం మసాలా దినుసుల చూర్ణం వేసి 3 నిమిషాలు ఉడకబెట్టండి.
- ఇప్పుడు బ్లాక్ టీ వేసి, కొద్దిగా మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి. అలాగే 2-3 నిమిషాలు ఉంచండి.
- ఇప్పుడు స్ట్రైనర్ ఉపయోగించి వడకడితే, వేడివేడి స్పైస్డ్ టీ రెడీ.
ఒక టీ కప్పులోకి సర్వ్ చేసుకొని గోరువెచ్చగా ఆస్వాదించండి.
సంబంధిత కథనం